
తమిళనాడులో ‘అమ్మ’ జయలలిత వారసత్వం కోసం శశికళ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చేట్లుంది. అమ్మ మేనకోడలు దీపా జయకుమార్ ను ఆర్ కె నగర్ నుండి పోటీ చేయాల్సిందిగా పెద్ద ఎత్తున ఒత్తిడి మొదలైంది.
విచిత్రమేమిటంటే, ఏఐఏడిఎంకెలోని దాదాపు నేతలందరూ శశికళకే మద్దతు ప్రకటించారు. అయితే, ప్రజలు మాత్రం ‘చిన్నమ్మ’ శశికళను తిరస్కరిస్తున్నారు.
జయలలిత ప్రాతినధ్యం వహిచిన ఆర్ కె నగర్ అసెంబ్లీ స్ధానం నుండి పోటీ చేయటానికి చిన్నమ్మ అన్నీ ఏర్పాట్లు చేసుకున్నది. అయితే, అనూహ్యంగా నియోజకవర్గ ప్రజలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ జయ స్ధానంలో శశికళను ప్రత్యామ్నాయంగా చూడలేమంటున్నారు. నియోజకవర్గం మొత్తం మీద వివిధ కులాలు, వర్గాల ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు.
అంతకన్నా విచిత్రమేమిటంటే నియోజకవర్గంలోని ప్రజల్లో ఎక్కువమంది దీపా జయకుమారే ఆర్కె నగర్లో పోటీ చేయాలని కోరుకోవటం. జయకు ఆమె మేనకోడలు దీపానే సరైన వారసురాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఏఐఏడిఎంకెలోని ఒక వర్గం దీపకు మద్దతుగా నిలబడుతోంది.
రాష్ట్ర స్ధాయిలోని నేతల్లో అత్యధికులు శశికళకు మద్దతుగా నిలబడుతుంటే, జిల్లాల స్ధాయిల్లో మాత్రం దీపకు మద్దతు పెరుగుతోంది. 14 జిల్లాల నుండి కార్యకర్తలు, నేతలు దీపా ఇంటికి వచ్చి మరీ తమ మద్దతు ప్రకటించటం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
రాష్ట్ర స్ధాయి నేతలొకవైపు, జిల్లాల కార్యవర్గాలు ఒకవైపు మోహరిస్తున్నాయి. అదేవిధంగా నియోజకవర్గ ప్రజల్లో అత్యధికులు దీపకు మద్దతు తెలపటంతో రాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడుతోంది. మరో ఐదుమాసాల్లో ఆర్కె నగర్ ఉప ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికను ప్రకటించే తేదీ దగ్గర పడేకొద్దీ తమిళ రాజకీయాలు సినిమా ఉత్కంఠను తలపిస్తున్నాయి.
చూడబోతే, పర్సనాలిటీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా దీపా జయకుమారే జయలలితకు నిజమైన వారసురాలిలాగ నిలుస్తుందేమో. మరి అదే నిజమైతే అమ్మ నెచ్చెలి శశికళ చూస్తూ కోర్చోదుకదా? అయితే ఏమి చేస్తుందనేది ఇప్పటికైతే సస్పెన్సే.