ఏపీలో మొదలైన కోడి పందాల జోరు.. భారీగా బరుల ఏర్పాటు.. చేతులు మారనున్న కోట్లాది రూపాయలు..!

By Sumanth KanukulaFirst Published Jan 14, 2023, 12:14 PM IST
Highlights

సంక్రాంతి పండగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఊరూరా కోడిపందాల బరులు కనిపిస్తున్నాయి.

సంక్రాంతి పండగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఊరూరా కోడిపందాల బరులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా చోట్ల కోడి పందాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. కోడి పందాల్లో కోట్లలో డబ్బు చేతులు మారనుంది. కొన్నిచోట్ల కోడి పందాలతో పాటు గుండాట బరులు వెలిశాయి. గుండాటలో కూడా లక్షల రూపాయలు చేతులు మారనుంది. కోడి పందాల్లో పాల్గొనేవారి కోసం పలుచోట్ల క్యూ ఆర్ కోడ్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు.

సంక్రాంతి వేళ మూడు రోజుల పాటు పందాలు జరిపేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి వేళలో కూడా పందాలు  కొనసాగేలా బరుల వద్ద  ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. పందెంలో బరిలో దింపే కోళ్లకు కొన్ని నెలల ముందు నుంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చి బరుల్లో దింపుతున్నారు. కోడి పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు ఏపీకి భారీ చేరుకుంటున్నారు. కొన్నిచోట్ల కోడి పందాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. 

అయితే కోడి పందాలను అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న.. నిర్వాహకులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లో కోడి పందాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే సంప్రదాయం ముసుగులో కొన్ని చోట్ల పందెంరాయుళ్లు నిర్వాహకులు కోళ్ళకు కత్తి కట్టి బరిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

click me!