సీఎన్జీకీ, ఎల్పీజీకీ తేడా తెలియడం లేదా: లోకేశ్‌పై సజ్జల సెటైర్లు

By Siva KodatiFirst Published Sep 13, 2020, 8:44 PM IST
Highlights

నేచురల్ గ్యాస్ పై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 

నేచురల్ గ్యాస్ పై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన సజ్జల సుదీర్ఘ కాలం అధికారంలో ఉండి వాస్తవాలు తెలుసుకోకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

కళ్ళు మూసుకొని ఏమీ జరుగుతుందో తెలుసుకోకుండా  ప్రభుత్వంపై చంద్రబాబు  బురద చల్లుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. లోకేష్ ఎంత చదువుకొని ఏమీ ఉపయోగమని రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.

వ్యాట్ పెంచుతూ ఇచ్చిన జీవో కూడా చదవకుండా లోకేష్ ట్విట్ చేస్తారా అని ఆయన నిలదీశారు. సీఎన్జీ, ఎల్పీజీకి కూడా లోకేష్ కి తేడా తెలియడం లేదా అని సజ్జల ఎద్దేవా చేశారు. అత్యాశకు పోయి ప్రభుత్వంపై లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏపీలో సీఎన్జీపై 20 కోట్ల టర్నోవర్ మాత్రమే ఉందని సజ్జల తెలిపారు.

దేశంలో, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాట్ పెంచాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.పేదలకు ఊతం ఇచ్చేలా ఏపీ సీఎం సంస్కరణలు అమలు చేస్తున్నారని సజ్జల చెప్పారు.

ఆర్ధికంగా పెదలను ఆదుకోవాలని చర్యలు తీసుకుంటూనే... కోవిడ్ సంక్షోభంలో కూడా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆసరా, చేయూత,పధకాల ద్వారా మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని... ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా తప్పించుకునే లక్షణం మాకు లేదని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు కాబట్టే పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నామని.. ప్రజలకు జవాబుదారి తనంతో పథకాలు అందిస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలు కూడా చంద్రబాబు మాఫీ చెయ్యలేకపోయాడని... ప్రభుత్వంపై ఏదో ఒక ఘటనను అంశాన్ని తెచ్చి అపఖ్యాతి తీసుకుని రావాలని చూస్తున్నారని

సజ్జల ఆరోపించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడే ఒత్తిళ్లకు వెనక్కి తగ్గలేదని... 23మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా అధికారంలోకి వచ్చామని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు లాగా కుట్రలు పన్నాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు.

విష పురుగు మాదిరిగా పాలనకు మచ్చ తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు. స్థాయికి మించి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని.. తునిలో రైలు దగ్ధం అయినప్పుడు ఎందుకు విచారణ చెయ్యలేదని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నాటకాలు వేయించడం,వేషాలు కట్టించడం చంద్రబాబు మానలేదని ఆయన ధ్వజమెత్తారు.

ప్రజా సంక్షేమం కోసం పాలనలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న తమపై మతం, కులం రంగు పులుముతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుసునని... రాష్ట్రంలో జరుగుతున్న కుట్రల వెనుక ఎవరు ఉన్నారో కూడా ప్రజలకు తెలుసునని సజ్జల ఆరోపించారు.

చంద్రబాబు అనుభవం, ఆలోచనల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని... చంద్రబాబు ,లోకేష్ హైదరాబాద్ లో ఉన్నారా మాల్దీవులలో ఉన్నారా అని రామకృష్ణారెడ్డి నిలదీశారు. లోకేష్ తండ్రి బాటలో నడవకుండా సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళాలని సజ్జల హితవు పలికారు.

లోకేశ్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన కోరారు. చిల్లర రాజకీయాలను లోకేష్ చంద్రబాబు చేయొద్దని.. పాలనా వ్యవస్థలో  ప్రతిపక్ష  పాత్ర పోషించడంలో చంద్రబాబు విఫలమయ్యారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 

click me!