ఎలాంటి ఆధారాలు లేకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతమ్మ ఆరోపణలు చేయడం బాధాకరమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
అమరావతి: ఎలాంటి ఆధారాలు లేకుండా తన తండ్రి Ys Viveknanda Reddy హత్యపై సునీతమ్మ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు Sajjala Ramakrishna Reddy మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.సీబీఐకి వివేకానందరెడ్డి కూతురు సునీతమ్మ, అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలపై మీడియాలో కథనాలు వచ్చాయి.ఈ విషయమై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ ఆరోపణలు చూస్తే Sunithamma చంద్రబాబు చేతిలో పావులుగా మారారని అన్పిస్తోందన్నారు.
Chandrababu Naidu నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియా దిగజారుడు కథనాలను ప్రచారం చేస్తోందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై మూడేళ్లుగా చంద్రబాబు నాయుడు కుట్ర చేయడమే పనిగా పెట్టుకొన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
వైఎస్ వివేకానందరెడ్డి స్వంత కుటుంబ సభ్యులే ఈ విషయాన్ని పెద్దది చేయడం సరైంది కాదన్నారు. ఐపీసీ 161 సెక్షన్ కింద CBI కి వాంగ్మూలం ఇచ్చారనే పేరుతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.వివేకానందరెడ్డి హత్యపై రోజుకో ఆరోపణలు చేస్తున్నారని సజ్జల చెప్పారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు రాజకీయంగా రంగు పులిమి విశృంఖంలంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు మండి పడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్టుగా చెబుతున్న లేఖ విషయమై సునీతమ్మ ఎందుకు దాచాల్సి వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
ఒకరి తర్వాత ఒకరు పద్దతి ప్రకారంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.తొలుత శంకర్ రెడ్డిని ఆ తర్వాత YS Avinash Reddy ని ఆ కేసులో దోషిగా చూపి చివరికి జగన్ వైపు చూసేలా ప్రయత్నంగా కన్పిస్తుందన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన ఇంట్లో ఉన్నది ఆయన కూతురు, అల్లుడు నియమించిన వ్యక్తులే ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
చనిపోయిన వివేకానందరెడ్డి ఆత్మ క్షోభించేలా ఆరోపణలు చేస్తున్నారని సజ్జల చెప్పారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి వివరించారు. గతంలో సిట్ నిర్వహించిన విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా విచారణ చేయడం లేదన్నారు. కానీ మరో కోణంలో సీబీఐ విచారణ చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
వైఎస్ వివేకానంద రెడ్డిది హత్య అయితే గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారని అప్పుడే అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ ఎందుకు కేసు పెట్టలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు దొరికితేనే నిందితులుగా గుర్తిస్తామని సీఎం జగన్ వివేకా కూతురు సునీతమ్మకు చెప్పారన్నారు. కానీ తాను ఊహించుకొన్న వ్యక్తులను ఈ కేసులో దోషులుగా చూపించాలని సునీతమ్మ కోరితే జగన్ తిరస్కరించడం సునీతమ్మకు నచ్చలేదన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరికి లాయర్ ను ఎవరు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కాల్ రికార్డులను పరిశీలిస్తే ఈ హత్య కేసులో ఎవరున్నారో తేలుతుందన్నారు.ఈ దిశగా విచారణ సాగిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.