వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిపై క్లారిటీ ఇచ్చిన సజ్జల.. ఆయన ఏమన్నారంటే..

By Sumanth KanukulaFirst Published Sep 22, 2022, 3:56 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్ నియమితులయ్యారనే వార్తల నేపథ్యంలో.. ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం నోటీసుపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్ నియమితులయ్యారనే వార్తల నేపథ్యంలో.. ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం నోటీసుపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్షునిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకోవాలని పార్టీ ప్లీనరీలో ప్రతిపాదించిన మాట వాస్తమేనని అన్నారు. అది పార్టీ నాయకుల, కార్యకర్తల ఆకాంక్ష అని చెప్పారు. అయితే శాశ్వత అధ్యక్షుడనే ప్రతిపాదనను సీఎం జగన్ తిరస్కరించారని వెల్లడించారు. జగన్ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్‌లో ఎక్కలేదన్నారు. దీంతో పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అనేది లేదని చెప్పారు. 

ఐదేళ్లకొకసారి అధ్యక్ష ఎన్నిక జరగాలని గత ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేశామని తెలిపారు. కానీ ప్లీనరీ సమయంలో శాశ్వత అధ్యక్షుడనే ప్రతిపాదన వార్తల్లోకి రావడంతో ఎన్నికల సంఘం స్పష్టత అడిగిందన్నారు. ప్రస్తుతానికి ఐదేళ్ల వరకు వైఎస్ జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని చెప్పారు. ఆ తర్వాత ఎన్నిక జరగనున్నట్టుగా వెల్లడించారు. 

Also Read: వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా కుదరదు .. జగన్‌కు ఎన్నికల సంఘం షాక్

ఇక, ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు ఉండరని ఈసీ వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి తమకు నివేదికను సమర్పించాల్సిందిగా వైస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైనట్లుగా మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఈసీ ఈ మేరకు స్పందించింది. ఏ పార్టీకి అయినా ఎప్పటికప్పుడు ఎన్నికలు జరగాలని, శాశ్వత అధ్యక్షుడు వంటి పదవులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఈసీ పేర్కొంది. దీనిపై పలుమార్లు లేఖ రాసినా వైసీపీ పట్టించుకోలేదని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. ఈసీ నియామవళికి అనుగుణంగానే దేశంలో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని ఈసీ వెల్లడించింది. శాశ్వత అధ్యక్షుడి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. 

click me!