యూపిలో కమలానికి సంకటం

First Published Jan 16, 2017, 3:47 AM IST
Highlights

ఆలయం నిర్మాణం విషయంలో తమకు హామీ ఇస్తేనే తాము కమలం పార్టీకి ప్రచారం చేస్తామంటూ రామమందిరంలో ప్రధాన పూజారి ఆచార్య సంత్యేంద్ర దాస్ గట్టిగా చెప్పారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలముందు కమలంపార్టీకి పెద్ద చిక్కే వచ్చిపడింది. రామమందిరం నిర్మిస్తామని ప్రధానమంత్రి స్వయంగా వచ్చి హామీ ఇస్తే కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికేదిలేదని సాధు, సంతులు తేల్చిచెప్పారు. అసలే, యూపిలో కమలం పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా, మోడి వారణాశి లోకసభ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రంలో పార్టీ కోలుకోవటం లేదు.

 

ప్రాంతీయపార్టీలైన అధికార సమాజ్ వాదిపార్టీతో పాటు బిహుజన్ సమాజ్ పార్టీ బలంగా ఉండటమే కారణం. దానికి తోడు కాంగ్రెస్ తో పాటు అనేక చిన్నా చితక పార్టీలు అనేకం ఉన్నాయి. దాంతో భాజపా ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపధ్యంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల ప్రజల్లో కమలంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అందుకే పార్టీ ఎంపిలెవరూ అభ్యర్ధులకు అనుకూలంగా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లలేకున్నారు.

 

ఇటువంటి పరిస్ధితుల్లో ఎస్పీ చెలరేగిన అంతఃకలహాలతో లబ్ది పొందుదామని భాజపా అనుకున్నది. అయితే, ములాయం కుటుంబంలో వివాదం ఎంత త్వరగా లేచిందో అంతే త్వరగా చల్లారిపోయింది. అదనంగా కాంగ్రెస్, ఆర్ఎల్డితో జతకట్టింది. దాంతో ఎస్పి కూటమి బలంగానే కనబడుతోంది. ఇక, బిఎస్పీ కూడా అధికారం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

 

ఇటువంటి పరిస్ధితుల్లో భాజపా నేతలు అభ్యర్ధుల తరపున ఉధృతంగా ప్రచారం చేస్తారనుకుంటే ప్రచారం చాలా చప్పగా సాగుతోంది. అటువంటిది హటాత్తుగా రామమందిరం ఆలయ ప్రస్తావన రావటం భాజపాకు ఇబ్బందే. మత, కుల ప్రస్తావన తెచ్చి ఓట్లు అడగటాన్ని ఎన్నికల కమీషన్ నిషేధించిన సంగతి అందరకీ తెలిసిందే. ఒకవేళ ఎవరైనా అభ్యర్ధులు ఓట్లడిగితే వారిపై కేసు నమోదు చేయాలని ఇసి ఆదేశించింది.

 

ఈ విషయాలు తెలిసీ అయోధ్యలోని రామమంధిరంలో ఉండే సాధు, సంతులు భాజపాకు అల్టిమేటం ఇవ్వటం గమనార్హం. ఆలయం నిర్మాణం విషయంలో తమకు హామీ ఇస్తేనే తాము కమలం పార్టీకి ప్రచారం చేస్తామంటూ రామమందిరంలో ప్రధాన పూజారి ఆచార్య సంత్యేంద్ర దాస్ గట్టిగా చెప్పారు. తమ మద్దతు లేకుండా భాజపా ఎన్నికల్లో గెలవలేందని హెచ్చరించారు కూడా. సత్యేంద్ర చెప్పిందాంట్లో ఏమీ అనుమానం లేదు. ఎందుకంటే, యూపిలో సామాన్య ప్రజలపై సాధు, సంతులు, మహంతుల పట్టు అందరికీ తెలిసిందే. వారు గనుక భాజపాకు మద్దతు ఇవ్వకపోయినా, వ్యతిరేకంగా చేసినా భాజపా పరిస్ధితి ‘మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు’గా తయారౌతుందనటంలో సందేహం అక్కర్లేదు.

click me!