
నరసరావుపేట : రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు తీస్తాయి... కానీ పల్నాడు జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ మాత్రం ప్రాణాలు కాపాడింది. ప్రమాదమేంటి... ప్రాణాలు కాపాడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ జరిగింది అదే. వేగంగా దూసుకువెళుతున్న బస్సు లారీనీ ఢీకొనడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం నుండి తెలంగాణలోని మునుగోడుకు ప్రయాణికులతో ఆర్టిసి బస్సు బయలుదేరింది. పల్నాడు జిల్లాలో బస్సు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా బ్రేకులు పెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ కు బస్సు ఆపడం సాధ్యంకాలేదు. ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంభయంతో వుండగా ఆ దేవుడే పంపినట్లు ఓ లారీ అడ్డువచ్చింది. ఆ లారీని ఢీకొట్టిన బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
లారీ నరసరావుపేట వైపు వెళుతుండగా పెట్లూరివారి పాలెం, ఉప్పలపాడు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిలైన బస్సు ఈ ట్రాన్స్ పోర్ట్ లారీని ఢీకొని వుండకుంటే అదే వేగంతో ముందుకు దూసుకెళ్లేది... దీంతో ఏ ఘోరం జరిగివుండేదో అని ప్రయాణికులు అంటున్నారు. ఎవ్వరికీ ఏం కాకుండా ఈ ప్రమాదం నుండి బయటపడ్డామంటే ఈ లారీ పుణ్యమేనని బస్ ప్రయాణికులు అంటున్నారు.
Read More తెలంగాణ అమ్మాయిలతో ఏపీలో వ్యభిచారం... భీమవరంలో గలీజ్ దందా (వీడియో)
ఈ ప్రమాదంలో లారీ ముందుభాగం దెబ్బతినడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇక బస్సులోని ప్రమాణికులంతా సురక్షితంగా వున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ లారీ డ్రైవర్ ను హాస్పిటల్ కు తరలించారు. అనంతరం రోడ్డుకు నిలిచిన వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే వాటిని పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.