ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబే విలనా?

Published : Feb 08, 2017, 02:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబే విలనా?

సారాంశం

నాదెండ్ల భాస్కరరావు, లక్ష్మీపార్వతి, దగ్గబాటి వెంకటేశ్వరరావు ఇలా..ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అప్పుడే స్పందించేస్తున్నారు. సినిమాలో ఎవరు హీరో, ఎవరు విలనో కూడా వారే చెప్పేస్తున్నారు.

 

 

‘ఆలూ లేదు చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం’ అన్నట్లుంది మన రాజకీయ నేతల విషయం. ఎన్టీఆర్ జీవితంపై ఓ సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించగానే సినిమాలో ఏమేమి ఉండాలో, ఎవరిని ఎలా చూపాలో, ఎవరిని ఎలా చూపకూడదో, సినిమా టైటిల్ ఏమిటో కూడా వారే చెప్పేస్తున్నారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్లో బాలకృష్ణ సినిమా తీయటమంటే అంత మాటలు కాదు. పైగా ఎన్టీఆర్ జీవితంపై సినిమా అనగానే ఏమి తీయాలో, ఏమి తీయకూడదో, ఎవరిని ఎలా చూపాలో బలయ్యకు ఇంకోరు చెప్పాలా?

 

సినిమాల్లో ఉన్నపుడు ఎన్టీఆర్ కు తిరుగులేదన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుతెర ఇలవేల్పుగా, వెండితెరపై రాముడు, కృష్ణుడుగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసారు. సినిమాల్లో వున్నంత వరకూ తిరుగేలేదు. 1982లో రాజకీయాల్లోకి అడుగుపెట్టటమే ఓ సంచలనమైతే నిష్క్రమణ కూడా అంతే సంచలనం. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి నిష్క్రమణ వరకూ ఉన్న మలుపులు...ప్రతిదీ ఓ సంచలనమే.

 

నాదెండ్ల భాస్కరరావు, రాంలాల్, చంద్రబాబునాయుడు, కృష్ణకాంత్, కుముద్బెన్ జోషి, వామపక్ష నేతలు, లక్ష్మీపార్వతి ఇలా పలువురు ఎవరిశక్తి కొద్దీ వారు ప్రముఖ పాత్రలే పోషించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో పాత్ర. వీళ్ళల్లో ఎవరు ఎటువంటి పాత్ర పోషించారో బాలకృష్ణకు తెలియంది కాదు. పలువురు నేతలు, ప్రజలకు కూడా చాలా విషయాలు తెలుసు. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి క్లైమ్యాక్స్ ఏంటి? ముఖ్యమంత్రిగా దింపేసిందెవరన్నది అందరకీ తెలిసిందే. ఎవరు అవునన్నా, కాదన్నా వైస్రాయ్ హోటల్ ఘట్టం ఎన్టీఆర్ జీవితంలో పెద్ద దెబ్బే. ఆ దెబ్బను ఎన్టీఆర్ చివరి వరకూ మరచిపోలేకపోయారు.

 

తనను రాజకీయంగా ఎవరు దెబ్బ కొట్టింది, వెన్నుపోటు పొడిచింది అన్న విషయాలు ఎన్టీఆరే స్వయంగా చెప్పిన ఇంటర్వూ క్యాసెట్లు కూడా బోలెడున్నాయి సర్క్యలేషన్లో. చివరకు కుటుంబ సభ్యులు కూడా తనకు ఎదురుతిరిగారనే మనస్తాపంతోనే కన్నుమూసారు. అయితే, ఆయన మృతి కూడా మిస్టరీనే. వాస్తవాలిలావుండగా, నాదెండ్ల భాస్కరరావు, లక్ష్మీపార్వతి, దగ్గబాటి వెంకటేశ్వరరావు ఇలా..ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అప్పుడే స్పందించేస్తున్నారు. సినిమాలో ఎవరు హీరో, ఎవరు విలనో కూడా వారే చెప్పేస్తున్నారు. అయితే, ఎవరు ఎన్ని చెప్పినా అందరూ ఏకగీవ్రంగా  తేల్చేసింది మాత్రం చంద్రబాబునాయుడే విలన్ అని.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?