
తమిళనాడు ముఖ్యమంత్రి ఒ. పన్నీర్ సెల్వంను చూస్తూంటే అయ్యో పాపమనిపిస్తోంది. తమిళనాడుకు తానే ముఖ్యమంత్రనన్న విషయం కూడా పన్నీర్ అనుకోవటం లేదేమో. ఏం చేస్తాం. పరిస్ధితులు అలా తగలడ్డాయ్ మరి. తెల్లవారి లేచిన తర్వాత ఏం చేయాలో కూడా సిఎంకు తెలియటం లేదట. ఎందుకంటే, తెల్లవారి లేచిన తర్వాత రెడీ అయి ఎక్కడికి పోవాలి. సెక్రటరేయట్ కు వెళితే ఓ తలనొప్పి. వెళ్ళకుండా ఇంటిలోనే కూర్చుంటే ఇంకో తలనొప్పి.
అలా అని పార్టీ కార్యాలయానికి వెళదామన్నాలేదు. ఏ హోదాలో వచ్చావని సెక్యూరిటీ అడిగినా అడుగుతారు. ఎందుకంటే, ఏఐఏడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ అనుమతి లేకుండా ఎవ్వరినీ సెక్యూరిటీ పార్టీ కార్యాలయంలోకి అనుమతించటం లేదట. పోనీ సెక్రటేరియట్ కు వెళదామంటే వెళ్ళి ఏం చేయాలన్నదే పెద్ద ప్రశ్న. ఓ సమీక్షా సమావేశం పెట్టేందుకు లేదు. పిలిస్తే ఎవ్వరూ రావటం లేదట. పూర్తిస్ధాయిలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో సహా నేతలెవరూ పన్నీర్ ను ముఖ్యమంత్రిగా గుర్తించటం లేదు.
సిఎం అయిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. అప్పుడే మంత్రులు మాట్లాడుతూ పన్నీర్ ను సిఎంగా పరిగణించటంలేదని మొహం మీదనే చెప్పాసారు. ఎంత విచిత్రమంటే సెక్రటేరియట్ మొత్తం శశికళ ఫొటోలతో నించిపోయాయి. దాంతో అప్పటి నుండి ఈయన మంత్రులను రమ్మనరు, వాళ్లూ ఈయన వద్దకు రారు. దాంతో సిఎంకు, మంత్రులకు సంబంధాలు తెగిపోయాయి. ఇక, పన్నీర్ కు ఒక్క ఎంఎల్ఏ కూడా బహిరంగంగా మద్దతు పలకటానికి ఇష్టపడటం లేదట. దాంతో ఎంఎల్ఏలతో కూడా మాటా మంతీ లేదు. ఎంపిల సంగతి చెప్పనే అక్కర్లేదు. పోనీ తానే ఎవరినైనా ఫోన్లో పలకరిద్దామంటే అవతలవైపు పలికేవారే లేరాయే. ఇంకెవరికి ఫోన్లు చేస్తారు?
సెక్రటేరియట్ లోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిద్దామంటే వారంతా పొయెస్ గార్డెన్లో చిన్నమ్మ వద్ద ఉంటారు. ఇంకేమి సమీక్ష సమావేశాలు. మంత్రులకైనా, ఎంఎల్ఏ, ఎంపిలకైనా లేదా ఉన్నతాధికారులకైనా ఆదేశాలివ్వాల్సింది చిన్నమ్మే. రథసారధి స్ధానంలో కూర్చున్నట్లు కనబడుతున్నది పన్నీరే అయినా పగ్గాలు మాత్రం వెనకున్న శశికళ చేతిలో ఉన్నాయి. సిఎం సీట్లో కూర్చున్నా చెప్పుకోలేని వ్యధను అనుభవిస్తున్నది దేశం మొత్తం మీద ఒక్క పన్నీరేనేమో. అందుకేనేమో పన్నీర్ పరిస్ధితి మీద సోషల్ మీడియాలో విపరీతమైన జోక్స్ కూడా కనబడుతున్నాయి.