
తమిళనాడు ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత సమాధి వద్ద హటాత్తుగా మౌన నిరశనకు దిగారు. కారణాలు ఇదీ అని తెలియదుగానీ బలవంతంగా తనను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయించటం, పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం లాంటి ఘటనలతో పన్నీర్ మనస్తాపం చెందినట్లు పార్టీలో ప్రచారంలో ఉంది. ఎవరికీ చెప్పకుండా పొద్దుపోయిన తర్వాత పన్నీర్ ఒంటరిగా జయ సమాధి వద్దకు వచ్చి మౌనంగా నిరశన దీక్షకు కూర్చోవటం ఓ సంచలనమే. ఉదయం నుండి ఎవరికీ అందుబాటులో కూడా లేరు. దాంతో పన్నీర్ పార్టీ మారుతారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే, హటాత్తుగా మౌనదీక్షకు కూర్చోవటం పలువురిని ఆశ్చర్య పరిచింది.
ఎప్పుడైతే పన్నీర్ నిరశన దీక్ష విషయం తెలిసిందో వెంటనే పార్టీ నేతలందరూ పోలోమంటూ మెరీనాబీచ్ లోని జయ సమాధి వద్దకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పోలీసులూ బిత్తరపోయారు. శశికళకు ఊహించని దెబ్బే. ముఖ్యమంత్రిగా నియమితులైనా తన మాటను శశికళ ఏనాడూ సాగనీయలేదు. దాంతో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, ఉన్నతాధికారులు కూడా పన్నీర్ మాట వినటం లేదు.
పైపెచ్చు తనతో హటాత్తుగా శశికళ రాజీనామా చేయించినట్లు తన సన్నిహితులతో పన్నీర్ వాపోయినట్లు సమాచారం. పార్టీ మొత్తం మీద తనను ఎవరూ పట్టించుకోవటం లేదన్న బాధ పన్నీర్లో బాగా ఎక్కువైపోయిందని ఏఐఏడిఎంకె వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఎవరినీ ఏమీ అనలేక, చేయలేక చివరకు తన నిరశనను జయలలిత సమాధి వద్ద మొదలుపెట్టటంతో తమిళనాట మరో సంచలనానికి పన్నీర్ సెల్వం తెర ఎత్తినట్లే.