
జిల్లాలోని కరణం బలరాం-గొట్టిపాటి రవికుమార్ వర్గాలు మరోమారు ఘర్షణకు దిగాయి. పై రెండు వర్గాల మధ్య పరిస్ధితి దశాబ్దాల తరబడి ఉప్పు-నిప్పులాగుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది వైసీపీలో ఉన్న గొట్టిపాటిని చంద్రబాబునాయుడు టిడిపిలోకి చేర్చుకున్నారు. రెండు వర్గాలకు ఏమాత్రం పడదని, కరణం బలరాం అభ్యంతరం చెబుతున్నా చంద్రబాబు వినిపించుకోలేదు. దాని పర్యవసానమే మొన్న జరిగిన జంటహత్యలు, ఈరోజు జరిగిన గొడవలు.
జిల్లా అధ్యక్ష పదవి విషయమై ఈరోజు మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావు సమక్షంలో నేతలు సమావేశమయ్యారు. అదే సమావేశానికి కరణంతో పాటు గొట్టిపాటి కూడా హాజరయ్యారు. మొన్న రాత్రి కరణం వర్గీయులు ఇద్దరు హత్యకు గురైన తర్వాత ఇద్దరు నేతలు, వర్గాలు ముఖాముఖి ఎదురుపడటం ఇదే. దాంతో వాతావరణం ఉద్రిక్తతంగా మారింది.
దానికితోడు ఒకరిని చూసి మరో వర్గం కామెంట్లు చేసుకోవటంతో మొదలై ఒక్కసారిగా గొడవకు దిగారు. దాంతో రెండువర్గాల మధ్య తోపులాటలు మొదలయ్యాయి. మద్దతుదారుల కోసం చివరకు కరణం, గొట్టిపాటి కూడా రంగంతోకి దిగారు. దాంతో పరిస్ధితి ఒక్కసారిగా అదుపుతప్పి కొట్టుకున్నారు.
అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను శాంతిపచేయటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.కరణంమద్దతుదారులు గొట్టిపాటిపైన, గొట్టిపాటి మద్దతుదారులు కరణంపైన పిడిగుద్దులు కురిపించారు. తోపులాటల్లో గొట్టిపాటి కింద పడిపోయారు. అక్కడే ఉన్న మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావులు ఏం చేయలేక చోద్యం చూస్తు కూర్చున్నారు.