కేసీఆర్, జగన్ మధ్య చిచ్చు: ఏమిటీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు?

By telugu teamFirst Published May 13, 2020, 8:12 AM IST
Highlights

కృష్ణా నదీ జలాలను తరలించుకుని వెళ్లడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఆ రాష్ట్ర సీఎం జగన్ కు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య చిచ్చుపెట్టింది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి మిత్రులుగా కొనసాగుతూ వచ్చారు. అయితే, వారి మధ్య పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చిచ్చు పెట్టింది.  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య విభేదాలకు దారి తీసే పరిస్థితి ఏర్పడింది. 

నిజానికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు ముందుకు వేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. 

Also Read: నీటి యుద్ధం: కేసీఆర్ అభ్యంతరాలకు వైఎస్ జగన్ రిప్లై

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మోతాదుకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుని వెళ్లడానికి దాని సామర్థ్యం పెంచుతుందనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. నిజానికి, రాయలసీమకు కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కు మాత్రమే ఉంటుంది. నికర జలాల కేటాయింపు లేదు. దీంతో వరదలు అధికంగా వచ్చే కాలంలో శ్రీశైలం నుంచి వరద నీటిని తరలించుకుని వెళ్లడానికి ఆ ప్రాజెక్టును చేపట్టారు. 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు సరఫరా చేసే నీటిని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద దాన్ని నిర్మించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. నీటి సరఫరాను నియంత్రించేందుకు నాలుగు తూముల ఏర్పాటు ఉంది.

Also Read: జగన్ ప్రభుత్వంపై కేసీఆర్ గుర్రు: పోరు తప్పదని చెప్పిన సీఎం

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. అయితే, శ్రీశైలం రిజర్వాయరులో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుని వెళ్లడానికి వీలవుతుందని, తెలంగాణకు 880 అడుగుల వద్ద నీటి సామర్థ్యం ఉన్నప్పుడు 2 టీఎంసీల నీరు తరలించడానికి వీలవుతుందని, అందువల్ల తెలంగాణకు ఏ విధమైన అన్యాయం జరగదని వైఎస్ జగన్ అంటున్నారు. 

వరదలు ఎక్కువగా వచ్చే పది రోజులు మాత్రమే శ్రీశైలం రిజర్యాయరులో నీటి మట్టం ఆ స్థాయిలో ఉంటుందని, ఆ పది రోజుల్లో మాత్రమే నీటిని తాము తీసుకుంటామని జగన్ వాదిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఆ వాదనతో ఏకీభవించే స్థితి లేదు. 

click me!