
రాజీనామాల విషయంలో వైఎస్ జగన్ తెలంగాణాలోని కెసిఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని అనుకున్నా, లేదా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అనుకున్నా అప్పట్లో కెసిఆర్ మాటిమాటికి రాజీనామాలు చేసేవారు. సమయం, సదర్భం చూసుకుని తాను మాత్రమే రాజీనామాలు చేయకుండా తన పార్టీ వారితో కూడా రాజీనామాలు చేయించేవారు. దాంతో ప్రభుత్వంపై ఒత్తిడి మొదలయ్యేది. రాజీనామాలతో అనుకున్నది సాధించినా లేకున్నా ప్రజల్లో సింపతీ మాత్రం పుష్కలంగా లభించేది.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపిలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా కెసిఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారేమో. అందుకనే ప్రత్యేకహోదా కోసం తమ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయిస్తానని కేంద్రప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసారు. అది కూడా వచ్చే బడ్జెట్ సమావేశాలలోగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలనే డెడ్ లైన్ కూడా విధించటం ఆశ్చర్యం.
అయినా జగన్ పిచ్చి గానీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అటు కేంద్రప్రభుత్వం కుమ్మకైన తర్వాత ప్రతిపక్ష నేత అడిగితేనో లేక హెచ్చరికలు జారీ చేస్తేనో ప్రత్యేకహోదా ఇచ్చేస్తారా? ప్రత్యేకహోదా ఇవ్వము అని స్పష్టంగా ప్రకటించటానికి కేంద్రప్రభుత్వానికి రెండున్నరేళ్ళు పట్టింది. అటువంటిది ప్రత్యేకహోదా ఇవ్వకూడదని తీసుకున్న నిర్ణయాన్ని జగన్ హెచ్చరికలు జారీ చేసారన్న కారణంతో తిరగదోడి బడ్జెట్ సమావేశాల్లోగా ఇచ్చేస్తారని ఎవ్వరూ అనుకోవటం లేదు.
ఆ విషయం జగన్ తెలీక కాదు హెచ్చరికలు జారీ చేసింది. కాకపోతే ప్రత్యేకహోదా అంశంలో ప్రజల మనోభావాలు బాగా దెబ్బతిన్నమాట వాస్తవం. ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు, ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమన్నా ఉంటే మరింత పెంచేందుకు, త్వరలో జరుగుతాయని అనుకుంటున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇటువంటి హెచ్చరికలు బాగా ఉపయోగపడతాయి.
రాష్ట్రప్రయోజనాలే జగన్ కు ముఖ్యమైనపుడు ఒక్క పార్లమెంట్ సభ్యులతోనే ఎందుకు ఏకంగా శాసనసభ్యులతో కూడా రాజీనామాలు చేయించవచ్చు కదా. పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయిస్తే చంద్రబాబుపై పెద్దగా ఒత్తిడి వుండదు. అదే శాసనసభ్యులతో కూడా రాజీనామాలు చేయిస్తే అటు కేంద్రప్రభుత్వం మీద, ఇటు రాష్ట్రప్రభుత్వం మీద కూడా ఏకకాలంలో ఒత్తిడి తెచ్చినట్లు ఉంటుంది. అందుకు ప్రజలు కూడా జగన్ కు తమ పూర్తి మద్దతును ఇచ్చే అవకాశం ఉంది. పనిలో పనిగా జనసేనాని, సినీనటుడు పవన్ కల్యాణ్ ను కూడా కలుపుకుంటే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కూడా ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.