
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఈ మధ్య తరచూ వార్తలో ఉంటున్నారు.కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బిసి వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బిసి నేత కెఇ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాబల్యం ఒక వైపు కెఇ కుటుంబం మరొక వైపు- ప్రత్యర్థి కుటుంబాలు. విజయభాస్కర్ రెడ్డిని ఎదిరించి నిలిచిన కుటుంబం ఇదొక్కటే. రాయలసీమలలో చాలామంది బిసిఎమ్మెల్యేలు, ఎంపిలు ఉన్నారు. వారెవరూ నాయకులు కాలేకపోయారు, వారంతా స్థానిక రెడ్డికి అనుచరులుగా మిగిలిపోయారు.
అయితే, కృష్ణమూర్తి నాయకత్వం కర్నూలు లోక్ సభ నియోజకవర్గం దాటి విస్తరించలేదు. ఒక అగ్రకులం నాయకుడిని ఎదరించి ఫ్యాక్షన్ నడిపే స్థాయికి ఎదిగినా ఆయన అఖిలాంధ్ర బిసినాయకుడు కాలేక పోయారు. ముగ్గురు తమ్ముళ్లు, బలమయిన కులం ఉన్నా ఆయన ములాయం సింగో, లాలూ ప్రసాదో కాలేకపోయారు.కారణం కెఇ బిసి రాజకీయాలకు ఐడియాలజీ లేదు. ఉత్తరాది ములాయం, లాలూబలమయిన సామాజిక న్యాయం వాదం రామ్మనోహర్ లోహియానుంచి అందుకున్నారు. దక్షిణాన తమిళనాడులో ద్రవిడ రాజకీయ పెరియార్ వారసత్వం ఉంది. కాని, కెయి వీటిని అందుకోలేకపోయారు. అందుకే ఆయన డోన్, పత్తికొండ ప్రాంతాల నాయకుడిగానే మిగిలిపోయారు. చంద్రబాబు *రెడ్లకు వ్యతిరేక* చట్రంలో ఇరుక్కుపోయారు.
అంతేకాదు,తాను నివాసముంటున్న కర్నూలులో కూడా జండా పాతలేక పోయారు. ఇదినిజంగా కృష్ణమూర్తి వైఫల్యమే. కర్నూలు పట్టణం ఆయన చేతిలోకి రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. కొన్నిసార్లు పొత్తు పేరుతో కర్నూలు శాసనసభ స్థానాన్ని సిపిఎం కయినా ఇచ్చారు గాని, కృష్ణ మూర్తి కుటంబానికి కర్నూలు దక్కకుండా చేశారు. ఫలితంగా ఆయన డోన్ కో లేదా పక్కనే ఉన్న పత్తికొండకో పోయి తలదాచుకోవలసింది.
రాజకీయాలు ఎపుడూ ఒక లాగే ఉండవు. ఏంతో మంది పేరుమోసిన మొనగాళ్లను ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు కెఇ తమ్ముళ్లను మాత్రం దూరంగా నే ఉంచుతూ వస్తున్నారు. నాయుడి వ్యవూం చక్కటి చిక్కటి రాజకీయం. కర్నూలు జిల్లాలో కెఇ తనవైపు ఉండాలి, రెడ్లకు వ్యతిరేకంగా. కెఇ మాత్రం బలపడగూడదు. అందుకే కెఇని ఉప ముఖ్యమంత్రిని చెేసి బిసిలకు పెద్ద పీట అన్నట్లు ప్రచారం చేసి రెవిన్యూ మంత్రిగా డొల్ల చేశాడు. రెవిన్యూ మంత్రికి అమరావతి భూములతో సంబంధం లేదు. అధికారుల బదిలీలతో సంబంధలేదు. అమరావతి కమిటీలలో ఆయన్ని తప్ప అందరిని వేస్తున్నారు. చంద్రబాబు నాయుడి క్యాబినెట్ లో కెఇ పేరుంటుంది కాని, ఆయన మాట్లాడేదంతా కేవలం రెవిన్యూ రికార్డుల కంప్యూటీకరణ గురించే. రెవిన్యూశాఖ మంత్రి కెయి, పెత్తనం ముఖ్యమంత్రిదే.
ఈ అవమానాల వల్ల కెఇ కృష్ణమూర్తి వార్తలొకెక్కుతూ వస్తున్నారు. అయితే చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యలో ఆయన కుటుంబ పాత్ర అరోపణ ఇంకొక విధంగా ఆయన పేరును వార్తల్లోకి లాక్కొచ్చింది. ఆయన ప్రతిష్టకు బాగా భంగం కల్గించింది.
తొలినుంచి తెలుగు దేశం రాజకీయాలు అనుకూలంగా లేకపోవడంతో, ఆయన కుటుంబం నుంచి మరొక తిరుగు లేని నాయకుడు రాలేకపోయాడు. చాలా కాలం తాను ప్రాతినిధ్యం వహించిన డోన్ నియోజకవర్గం 2014లో వైసిపికి వెళ్లి పోయింది. అక్కడ నుంచి ఒక బుగ్గన రాజేంద్ర నాథ్ గెలిచాడు.కెయి సోదరుడు ఓడిపోయాడు. గతంలో రెండు మూడుసార్లు గెల్చిన మరొక తమ్ముడు కెఇ ప్రభాకర్ ని చంద్ర బాబు నాయుడు దూరంగా ఉంచుతున్నారు. ఇపుడు కర్నూల్ అసెంబ్లీ స్థానం ఆళ్ల గడ్డకు చెందిన ఎస్ వి కుటుంబం చేతిలోకిపోయింది. డోన్ వైసిపి చేతిలోకి పోయింది. ఇక మిగిలింది పత్తికొండయే. ఇపుడు కర్నూల్ జిల్లా ఆళ్ల గడ్డ ఎలుబడిలోకి వెళ్లి పోతా వుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కెయి కృష్ణ మూర్తి ఇంచుమించుగా ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రులయ్యారు. వారు ముగ్గురు మంచి స్నేహితులని కూడా చెబుతారు. కుటుంబ పరంగా వైఎస్ లాగే కెఇ కూడా ప్రాబల్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. నిజానికి చంద్రబాబుదే సాధారణ రైతుకుటుంబ నేపథ్యం.
ఇందులో రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధాన శక్తి. ఇంత కాకపోయినా, చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ నాయుడు కూడా నాయకుడయ్యాడు. అయితే, కృష్ణ మూర్తి కుమారుడు శ్యాంబాబు బాగా వెనకబడిపోయాడు. ఆయనింకా రాజకీయాల్లోకే రాలేదు.
కృష్ణమూర్తి చింతంతా శ్యాంబాబును 2019లో ఎమ్మెల్యే చేసి కెయి కుటుంబ వారసత్వం కొనసాగించడమే. అది టిడిపి వల్లే సాధ్యమని ఆయన నమ్ముతున్నారు. తాను రిటైరవుతానని, పత్తికొండ సీటునో మరొకదాన్నో కుమారుడి కి ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రితో చెప్పారని, దానికి బాబు సుముఖంగా ఉన్నారని కృష్ణమూర్తి సహచరులు చెబుతున్నారు. 2019లో కెయి శ్యాంబాబు ఎమ్మెల్యే కాకపోతే చాలా కష్టం. తాను రిటైరయ్యాక, చంద్రబాబు తన తమ్ముళ్లనెవరని లెక్క చేయడేమో ననే అనుమానం కృష్ణమూర్తిలో ఉన్నట్లుంది. ఈ ఆశతోనే ఆయన ప్రభుత్వంలో ఎదురవుతున్న అవమానాలన్నింటిని భరిస్తున్నారు.
రాజకీయాల్లో చాలా పాతకుటుంబాలు కనుమరుగయ్యే పరిస్థితులు వస్తున్నాయి. నాయకత్వం స్థానంలో ఉంటే తప్ప మనుగడ లేదు, వారసుల్నీ తయారుచేయడం కష్టమవుతూ ఉంది. కొత్త కుటుంబాలు ఎక్కడిక్కడ జండాలు పాతుతున్నాయి. రాజకీయంగా వెనకబడిన కెఇ కుటుంబం కూడా ఇపుడు ఈ గడ్డు కాలం ఎదుర్కొంటూ ఉంది.