అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?

Published : May 22, 2017, 09:38 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?

సారాంశం

ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తున్నదని కాదుగానీ జనాలకు కూడా అదే అనుమానాలు ఉన్నాయి. ఒకవైపు హవాలా కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఇంకోవైపు అధికారపార్టీ నేతలు ఏకంగా పోలీసు అధికారులపైనే ధౌర్జన్యాలు చేస్తున్నారు. ఏ నేరం జరిగినా దాని వెనకాల అధికార పార్టీ నేతల హస్తమే స్పష్టంగా కనబడుతోంది.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వమనేది ఉందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తున్నదని కాదుగానీ జనాలకు కూడా అదే అనుమానాలు ఉన్నాయి. ఒకవైపు హవాలా కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఇంకోవైపు అధికారపార్టీ నేతలు ఏకంగా పోలీసు అధికారులపైనే ధౌర్జన్యాలు చేస్తున్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇంకోవైపు ప్రతిపక్ష వైసీపీ నేతలపై దాడులు, హత్యలు. అవినీతి, అక్రమాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏ నేరం జరిగినా దాని వెనకాల అధికార పార్టీ నేతల హస్తమే స్పష్టంగా కనబడుతోంది.

మూడేళ్ళ క్రిందటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ఎన్నుకున్నదెందుకు? జరుగుతున్నదేమిటి అని జనాలు భేరీజు వేసుకుంటున్నారంటే అది వారి తప్పు కాదు. అంత ఘోరంగా ఉంది చంద్రబాబు పాలన. ఒక్కపుడు జిల్లాల్లో నియమించాల్సిన అధికారులను చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసేవారు. తన పేషీలోని అధికారుల ఎంపికలో కూడా కొన్ని పద్దతులు పాటిచేవారు. కానీ ఇపుడు అవేమీ కనబడటం లేదు. అందలాలు ఎక్కటానికి ‘మనవారైతే’ చాలు అన్నట్లు తయారైంది.

రాష్ట్రస్ధాయిలో కానీ, జిల్లాల స్ధాయిలో కానీ అసమర్ధలే కీలక స్ధానాల్లో ఉన్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎవరూ ఎవరినీ నియంత్రించే పరిస్ధితి కనబడటం లేదు. విజయవాడలో బయటపడిన కాల్ మనీ సెక్స్ రాకెట్, విశాఖపట్నం, విజయవాడలో వెలుగు చూసిన హవాలా రాకెట్, ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో టిడిపి నేతల వీరంగాలు, అంతుకుముందు కడప, నెల్లూరు, కర్నూలు స్ధానికసంస్ధల ఎంఎల్సీఎన్నికల్లో అధికారపార్టీ నేతల అక్రమాలు, ఉన్నతాధికారులపై ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంపి కేశినేని నాని, ఎంఎల్సీ బుద్దా వెంకన్న దౌర్జనాలు, ఎస్ఐనే నిర్బంధించిన తణుకు ఎంఎల్ఏ, ప్రతీ జిల్లాలోనూ ఇసుక మాఫియాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతల దోపిడి..ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కేలేదు.

దౌర్జన్యాల్లో, దోపిడిలో, అవినీతి, అక్రమాలు, హత్య రాజకీయాల్లో అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా ఎవరిపైనా చర్యలు లేవు. అదే సమయంలో ప్రభుత్వం వైఖరిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, జనాలపై మాత్రం ఒకటికి పది కేసులు, నిర్బంధాలు, జైలు శిక్షలు. రాష్ట్రంలో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టిడిపి నేతల వికృత చేష్టలు ఇంకెన్ని బయపడతాయో అర్ధం కావటం లేదు.

PREV
click me!

Recommended Stories

Anitha Praises Woman Constable: జన్నాల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచావ్ తల్లి | Asianet News Telugu
CM Chandrababu Naidu Speech: 6కి.మీ. నడిచి స్కూల్ కి వెళ్ళా చంద్రబాబు ఎమోషనల్| Asianet News Telugu