రాష్ట్ర ప్రయోజనం కోసం రెండు పార్టీల శ్రేణులు కష్టపడి పనిచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.
అమరావతి: జనసేన ఓటు టీడీపీకి, టీడీపీ ఓటు జనసేనకు బదిలీ అయినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.శనివారం నాడు అమరావతిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.ఓటు చీలకుండా జాగ్రత్త పడాలని రెండు పార్టీల కార్యకర్తలను కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కువ సీట్లు తీసుకోవడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే తమ ముందున్న కర్తవ్యంగా ఆయన చెప్పారు.
also read:అభ్యర్థుల ఎంపికపై కోటి మంది నుండి అభిప్రాయ సేకరణ: చంద్రబాబు
చాలా బాధ్యత యుతంగా ఆలోచించి తక్కువ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 60, 70 స్థానాలు తీసుకోవాలని తనకు చాలా మంది పెద్దలు చెప్పారన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు కనీసం 10 అసెంబ్లీ స్థానాలు ఉండి ఉంటే ఎక్కువ స్థానాల్లో పోటీకి అవకాశం ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ఆయన వివరించారు.
also read:తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?
టీడీపీ-జనసేన కూటమి బలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ సీట్లను కుదించుకున్నట్టుగా చెప్పారు. సీట్లు త్యాగం చేసినవారికి, కష్టపడి పనిచేసిన వారికి రాష్ట్రంలో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంచి ప్రతిఫలం ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.