మాజీ మంత్రి పరిటాల సునీత, తనయుడు శ్రీరామ్ పై పోలీస్ కేసు నమోదు

By Arun Kumar PFirst Published Mar 25, 2022, 12:58 PM IST
Highlights

మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాామ్ తో పాటు రాప్తాడు టిడిపి నాయకులపై పోలీస్ కేసు నమోదయ్యింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు వీరిపై కేసు నమోదయ్యింది. 

అనంతపురం: మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకురాలు పరిటాల సునీత (paritala sunitha), ఆమె తనయుడు శ్రీరామ్ (paritala sriram) పై అనంతపురం జిల్లాలోని రాప్తాడు (raptadu) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి నిబంధనలకు విరుద్దంగా రాప్తాడులో ర్యాలీ నిర్వహించినందుకు వీరిద్దరిపై కేసు నమోదయ్యింది.   

ఈకేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం అనంతపురంలో జిల్లాలో 30పోలీస్ యాక్ట్ అమల్లో వుందని...  అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు,నిర్వహించడాన్ని నేరంగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. ఈ నిబంధలను పట్టించుకోకుండా రాప్తాడులో జాతీయ రహదారిపై భారీగా నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిటాల సునీత, శ్రీరామ్ ర్యాలీ నిర్వహించారని పోలీసులు పేర్కొన్నారు.  అంతేకాదు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద కొందరు నాయకులు ప్రసంగించారని తెలిపారు. 

ఇలా 30 పోలీస్ యాక్ట్ కు విరుద్దంగా ర్యాలీ నిర్వహించి ప్రసంగించిన నాయకులందరిపై కేసులు నమోదు చేసినట్లు రాప్తాడు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ తో పాటు టిడిపి నాయకులు సాకే తిరుపాల, పంపు కొండప్ప, సిపిఐ నాయకులు రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు రాప్తాడు పోలీసులు తెలిపారు. మొత్తం 39 మంది నాయకులపై 143, 341, 188ఆర్/డబ్ల్యూ , 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

రాప్తాడు నుండి జాకీ పరిశ్రమ వెళ్ళిపోవడాన్ని  నిరసిస్తూ టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమ స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారణంగానే తరలిపోయిందని పరిటాల సునీత ఆరోపించారు.  ఈ సందర్భంగా జాకీ పరిశ్రమ ఏర్పాటుకోసం కేటాయించిన స్థలం నుంచి రాప్తాడు తహసీల్దార్ కార్యాలయం వరకు టిడిపి భారీ ర్యాలీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో పరిటాల సునీత,ఆమె తనయుడు  శ్రీరామ్ తో నాటు టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. 

జాకీ పరిశ్రమ యజమాన్యానికి ఎమ్మెల్యే తోపుదుర్తి రూ. 15 కోట్లు డిమాండ్ చేశారని సునీత ఆరోపించారు. జాకీ పరిశ్రమ వచ్చి ఉంటే రాప్తాడు కలకలలాడేదని... 6 వేల మందికి ఉపాధి కలిగి ఉండేందని అన్నారు. కానీ ఎమ్మెల్యే అవినీతి కారణంగా ఈ పరిశ్రమ తరలిపోయిందని మాజీ మంత్రి సునీత అన్నారు. 

ఇదిలావుంటే ఇటీవల పరిటాల సునీత, రాప్తాడు వైసిపి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల  తూటాలు పేలుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులైన వీరు వ్యక్తిగత ఆరోపణలకు కూడా దిగడంతో ఒక్కసారిగా  రాప్తాడు వేడెక్కింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తిపై సునీత సంచలన ఆరోపణలు చేసారు.

శ్రీరాములయ్య సినిమా షూటింగ్ సమయంలో తన భర్త పరిటాల రవీంద్రను చంపడానికి తోపుదుర్తి ప్రయత్నించారని సునీత ఆరోపించారు. తన భర్త  వెళుతున్న కారుకు కారుకింద బాంబు పెట్టించింది మీరు కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఈ బాంబు పేలుడులో 26మంది మృతిచెందారని... వీరిని పొట్టనబెట్టుకున్న పాపంలో ప్రకాష్ రెడ్డికి పాలుందని సునీత ఆరోపించారు. తమది రక్తచరిత్ర అంటున్న ఎమ్మెల్యే ముందు తన చరిత్ర ఏమిటో చూసుకుంటే మంచిదని హెచ్చరించారు. 

వైసిపి ఎమ్మెల్యే ముందు నియోజకవర్గ అభివృద్ది గురించి ఆలోచిస్తే మంచిదన్నారు. ఆయన అవినీతి, అక్రమాలను సినిమాగా తీయవచ్చని... ఆ రోజులు దగ్గర్లోనే వున్నాయని సునీత అన్నారు. ప్రజలకోసం ప్రాణాలనే త్యాగం చేసిన తన భర్త రవీంద్ర గురించి, ఎలాంటి అవినీతి మరకలు లేని తన కుంటుంబంపై  మాట్లాడితే సహించబోనని పరిటాల సునీత హెచ్చరించారు. 


 

click me!