
Andhra Pradesh: ఇటీవల గుంటూరు జిల్లాల్లో ఓ బాలికపై జరిగిన లైంగికదాడి కేసు సంచలనంగా మారింది. లైంగికదాడికి సంబంధించి అధికార పార్టీనేత, ఏపీ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) ఛైర్మన్ కొండూరు అనిల్‌బాబు హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఎస్సీ కమిషన్ సైతం విచారణకు ఆదేశించింది. వివరాల్లోకెళ్తే.. ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ బాలికపై లైంగికడాది జరిగింది. అయితే, ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ వైకాపా నేత, ఏపీ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) ఛైర్మన్ కొండూరు అనిల్‌బాబు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలి కుటుంబం ఆయనపై రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెపై లైంగికదాడి చేశారనీ, ఎవరికైనా చెబితే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలిని.. అనిల్ ఆయన అతిథిగృహాలు, ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. అయితే, లైంగికదాడికి సంబంధించిన విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరించారని పేర్కొన్నారు. ఈ ప్రాణభయంతో.. బెదిరింపుల కారణంగా విచారణ సమయంలో అధికార పార్టీనేత, ఏపీ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) ఛైర్మన్ కొండూరు అనిల్‌బాబు పేరు చెప్పలేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్సీ కమిషన్.. విచారణకు ఆదేశించింది. ఇక ఇదివరకు బాధితురాలి నుంచి కోర్టు, పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ ప్రధాన అనుయాయుడు కన్నా భూశంకర్ ఉండటంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం అధికార పార్టీ నేత, ఆఫ్కాఫ్ ఛైర్మెన్ ఈ లైంగికదాడికి పాల్పడ్డాడని బాలిక తండ్రి ఫిర్యాదుతో ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చకు తెరలేపింది.
బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మెన్ విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఫిర్యాదు అందిన విషయాన్ని స్పష్టం చేశారు. బాలికపై లైంగికదాడి కేసులో మరికొందరు ఉన్నారని బాలిక తండ్రి తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టాలని గుంటూరు పోలీసులను ఆదేశించామని ఎస్సీ కమిషన్ పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి..
కరోనా వైరస్ బాధపడుతూ.. బాధిత బాలిక, ఆమె తల్లి గుంటూరు జీజీహెచ్‌లో వైద్యం నిమిత్తం చేరారు. అయితే, బాలిక కోలుకుంది. తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో పనిచేస్తున్నానని పరిచయం చేసుకుంది ఓ మహిళ. వీరి పరిచయం మరింత బలపడటంతో కరోనా కు నాటు వైద్యం చేస్తే తగ్గుతుందని నమ్మించి.. బాధిత బాలికను ఆమె ఇంటికి తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దింపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు తిప్పుతూ.. వ్యభిచారం చేయించింది. అయితే కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాలిక తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలల క్రితం వారి చెరనుంచి తప్పించుకుని బాధితురాలు తన తండ్రి వద్దకు చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మేడికొండూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలికను తీసుకెళ్లిన మహిళ అరండల్‌పేట స్టేషన్ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 66 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక..
తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వారు బాలిక తండ్రిని ప్రలోభపెట్టి.. నాపై కేసు పెట్టించారని వైకాపా నేత, ఏపీ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) ఛైర్మన్ కొండూరు అనిల్‌బాబు ఆరోపించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదనీ, ఏ విచారణకైనా సిద్దమంటూ ఆయన తెలిపారు.