
నరసన్నపేట: దివంగత టిడిపి నేత కింజరాపు ఎర్రనాయుడు (kinjarapu errannaidu) పేరుతో నిర్మితమవుతున్న చిన్నారుల పార్కును కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా (srikakulam district) నరసరావుపేటలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెండు జేసిబిలతో పార్క్ వద్దకు చేరుకుని నిర్మాణదశలో వున్న పార్కును కూల్చివేయసాగారు. విషయం తెలిసి అక్కడికి చేరుకుని అడ్డుకోడానికి ప్రయత్నించగా వారిపై దాడికి తెగబడ్డారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పార్క్ లో ఈ విధ్వంసాన్ని అడ్డుకున్నారు.
పోలీసులు, టిడిపి నాయకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత టిడిపి ప్రభుత్వ హయాంలో దాదాపు రెండు కోట్ల వ్యయంతో నరసన్నపేటలోని ఇందిరానగర్ కాలనీలో ఎర్రన్నాయుడు పేరిట చిల్డ్రన్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. గ్రామ పంచాయితీ నిధుల నుండి 34లక్షల రూపాయలు ఇందుకోసం విడుదలవగా గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
అయితే ఈ స్థలం కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి చెందిందని... గతంలో తమకు కేటాయించినట్లుగా కొందరు పేర్కొంటున్నారు. ఇప్పుడేమో చిల్డ్రన్ పార్క్ నిర్మాణం చేపడుతున్నారని... తమకు కేటాయించిన స్థలంలో చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలంటూ 15మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పటివరకు కార్యాలయ గదులు, రీడింగ్ రూం, ప్రహారితో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తవగా మిగతా పనులు ముందుకు సాగకుండా ఆగిపోయాయి.
అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పార్క్ స్థలాన్ని కబ్జా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న (శనివారం) రాత్రి ఏకంగా రెండు జేసిబిలతో కొందరు పార్క్ వద్దకు చేరుకుని ముందుగా ప్రహారిని కూల్చి లోపలికి ప్రవేశించారు. అనంతరం రీడింగ్ రూం, కార్యాలయ గదులను కూడా ధ్వంసం చేసారు. విద్యుత్ సదుపాయాన్ని తొలగించి రోడ్లను ధ్వంసం చేసారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మాజీ ఎమ్మెల్యే బుగ్గ రమణామూర్తి (bugga ramanamurthy) ఆదేశాలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎర్రనాయుడు చిల్డ్రన్ పార్క్ (errannaidu chilgren park) విధ్వంసాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించగా వారిపైనా దాడికి యత్నించారు. దీంతో పార్క్ వద్దనుండి పరుగుతీసి దాడి నుండి తప్పించుకున్న టిడిపి కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేకు సమాచారమిచ్చారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడికి చేరుకుని పార్క్ విధ్వంసాన్ని అడ్డుకున్నారు. కూల్చివేతకు ఉపయోగించిన జేసిబిలతో పాటు ఇతర యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలావరకు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.
టిడిపి నాయకులు, కార్యకర్తలు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు. పార్క్ స్థలంపై కన్నేసి కబ్జాకు యత్నించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు బిఎల్ శర్మతో పాటు మరికొందరు పార్క్ స్థలం కబ్జాకు యత్నిస్తున్నారని... వారే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. వీరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్దకూడా టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగాయి.