
రాష్ట్రంలోని కాపులందరూ బిసిలయిపోతారా? అధికారపార్టీ నేతలు అవుననే చెబుతున్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా తెరవెనుక ఏమన్నా పావులు కదులుతున్నాయోమో? కాపులను బిసిల్లోకి చేరుస్తానన్నది పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన రాజకీయ హామీ. అప్పటి ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో కాపులను, బిసిల్లోకి చేర్చేస్తానని చెప్పారు. సరే, షరామామూలుగానే అధికారంలోకి రాగానే హామీని అటకెక్కించేసారనుకోండి అది వేరే సంగతి.
అక్కడే కాపు సమాజికవర్గానికి మండింది. ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగిపోయారు ఉద్యమాలంటూ. అప్పటి నుండి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. కాపులు తమను బిసిల్లోకి చేర్చమని ఒకవైపు ఉద్యమాలు చేస్తుండగానే, మరోవైపు కాపులను బిసిల్లోకి చేర్చవద్దని బిసిలు చేస్తున్న ఆందోళనలను కూడా అందరూ చూస్తున్నది. ఇరువైపుల ఉద్యమాలు కూడా చంద్రబాబు పుణ్యమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇటువంటి నేపధ్యంలోనే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ తాజాగా మాట్లాడుతూ, వచ్చే మార్చికల్లా కాపులను బిసిల్లోకి చేర్చటం ఖాయమని చెప్పారు. ఈ మేరకు కసరత్తు కూడా జరుగుతోందట. కాపులను బిసిల్లోకి చేర్చటం వల్ల బిసిలకు ఎంతమాత్రం అన్యాయం జరగదని రామానుజయ హామీ కూడా ఇచ్చేసారులేండి. ఎందుకంటే, కాపులు కేవలం విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ కోరుకుంటున్నారట. రాజకీయంగా రిజర్వేషన్ కోరుకోవటం లేదు కాబట్టి బిసిలకు ఎటువంటి నష్టం లేదన్నది ఛైర్మన్ సమర్ధింపు.
ఒకసారి కాపులను బిసిల్లోకి చేరిస్తే రిజర్వేషన్ల వల్ల విద్యా, ఉద్యోగాల్లో అదనంగా పెరిగే పోటీ ఎంత? రాజకీయంగా పెరిగే పోటీ ఎంత అన్నది బహుశా ఛైర్మన్ కు అవగాహన లేదేమే? అయినా కాపులను బిసిల్లోకి చేర్చాలని చంద్రబాబు అనుకుంటే సరిపోదు. చంద్రబాబు నిర్ణయం అమలు కావాలంటే ఫైల్ ఢిల్లీదాకా వెళ్ళాలన్న విషయం రామానుజయ్యకు తెలీదేమో?