శ్రీవారి గులాబీ రంగు వజ్రాన్ని జెనీవాలో వేలం వేశారా?

First Published May 20, 2018, 2:04 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిపై మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిపై మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. గులాబీ రంగు వజ్రం ఉండేదని, భక్తులు విసిరిన నాణేలకు అది పగిలిపోయిందని రికార్డుల్లో రాశారని, ఇటీవల ఓ గులాబీ రంగు వజ్రాన్ని జెనీవాలో వేలం వేశారని, అది ఇదేనని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. 

ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం ఆగమ శాష్త్రానికి విరుద్దమని ఆయన అన్నారు. ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఆయన అడిగారు. కేవలం నాలుగు బండలను తొలగించడానికి 25 రోజుల పాటు పోటును మూసేశారని అన్నారు.. పోటులో స్వామివారికి మూడు పూటలా అన్న ప్రసాదాలు చేస్తారని వెల్లడించారు.

ఇటీవల ఆ పోటును మూసివేశారని, తాత్కాలికంగా మరోచోట ప్రసాదాలు తయారు చేస్తున్నారని చెప్పారు. ప్రసాదం తయారీని భక్తులు చూడకూడదనిస కేవలం తయారుచేసే వ్యక్తి, అర్చకుడు మాత్రమే వాటిని పర్యవేక్షించాలని రమణ దీక్షితులు అన్నారు. 

25 రోజుల పాటు అపవిత్ర స్థలంలో ప్రసాదాన్ని తయారు చేశారని, ఆ 25 రోజుల పాటు స్వామివారు ఉపవాసం ఉన్నట్లేనని అన్నారు. స్వామివారిని పస్తులుంచడం సరికాదని, ఆగమ శాష్త్రాలకు విరుద్దం అని వ్యాఖ్యానించారు. 

వేయి ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాకారాలను పడగొట్టారని అన్నారు. మరమ్మత్తుల పేరుతో ప్రాచీన కట్టడాలను పడగొట్టడం ఎంతవరకు మంచిదని అడిగారు. ఎవరి అనుమతి లేకుండా మరమ్మత్తులు చేయడం ఎంతవరకూ సమంజసం అని అన్నారు.

అర్చకులంటే టీటీడికి చులకనభావమని అన్నారు. ఇనుప నిచ్చెనతో స్వామివారిని మండపంపైకి ఎక్కించారని, ఇనుము తాకకూడదని ఆయన అన్నారు. 1996 నుంచి ఆభరణాలు మాయమవుతున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

click me!