ధనవంతులకే ప్రాధాన్యత, వీఐపీల సేవలో అధికారులు : టీటీడీలో పరిస్థితులపై రమణ దీక్షితులు ట్వీట్

Siva Kodati |  
Published : Jan 29, 2023, 04:21 PM IST
ధనవంతులకే ప్రాధాన్యత, వీఐపీల సేవలో అధికారులు : టీటీడీలో పరిస్థితులపై రమణ దీక్షితులు ట్వీట్

సారాంశం

తిరుమల శ్రీవారి ఆలయ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ధనికులకు ప్రాధాన్యతను ఇస్తున్నారని, వీఐపీల సేవలోనే తరిస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై సంచలన ఆరోపణలు చేశారు శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆలయ అధికారులు ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ సొంత ప్రణాళికల ప్రకారం పనిచేస్తున్నారని.. ధనికులకు ప్రాధాన్యతను ఇస్తున్నారని రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీఐపీల సేవలోనే తరిస్తున్నారని.. ఇలాంటి పరిస్ధితులను ఏపీలోనే చూస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదిలావుండగా..తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్ వీడియోకు సంబంధించిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌కు పర్మిషన్ ఇచ్చింది వాస్తమేనని అన్నారు. కారిడార్ ఏర్పాటు చేసుకునేందుకు అన్నదానం దగ్గర నుంచి గార్బెజ్ సెంటర్ వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌ పర్మిషన్ అడిగితే ఇచ్చామని చెప్పారు. ఆ ప్రాంతంలో మాత్రమే సర్వేకు అనుమతి ఉందన్నారు. అయితే వాళ్లు అత్యుత్సాహంతో ఇది చేశారా? ఎవరైనా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి వీడియోను క్రియేట్ చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. 

ఆ వీడియోను ఫోరెన్సిక్ డిపార్టమెంట్‌కు పంపించి ఎలా చేశారనేది గుర్తించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. వైరల్ అయినా వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందని చెప్పారు. అత్యుత్సాహంతో చేసినా, ఏ విధంగా చేసినా తప్పు తప్పేనని అన్నారు. అయితే అవి ఫేక్ వీడియోలైతే ఏం చేయలేమని అన్నారు. తిరుమల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదని స్పష్టం చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామని వెల్లడించారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే