ఆ మేడమ్ ఎవరు: రమణదీక్షితులు సూటి ప్రశ్న

First Published Jun 20, 2018, 3:55 PM IST
Highlights

భూకంపం వచ్చినట్లుగా పోటును తవ్విపోయడంపై తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: భూకంపం వచ్చినట్లుగా పోటును తవ్విపోయడంపై తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్వామివారికి నైవేద్యం చేసే పాకశాల నుంచి సంపద దాచిన ప్రాకారానికి సొరంగ మార్గం ఉందని ఆయన చెప్పారు. అలాంటి పాకశాలలో నిర్మాణ పనులు ఎందుకు చేశారో చెప్పాలని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అడిగారు. పోటును ఎందుకు మూసేశారో తెలియాలని అన్నారు. 


భూకంపం వచ్చిన మాదిరిగా పోటును తవ్వేశారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అనుమతితోనే ఈ పనులు నిర్వహిస్తున్నామని జేఈ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఒక మేడం గారు చెప్పారని జేఈ అన్నారని, ఆ మేడం ఎవరో తెలియాలని రమణదీక్షితులు ఆయన అన్నారు.

కృష్ణదేవరాయల విలువైన సంపదను తిరుమలలో ఎక్కడెక్కడ ఉంచారో చరిత్ర చెబుతుందని ఆయన అన్నారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు స్వామివారికి 18 లక్షల మోహరీలు కానుకగా ఇచ్చారని ఆయన అన్నారు. ఒక్క మోహరి అంటే.. 100 గ్రాముల బంగారమని ఆయన అన్నారు. ఈ సంపదను ఆలయ ప్రాకారంలోనే దాచి ఉంచినట్లుగా చరిత్ర చెబుతోందని తెలిపారు.
 
వెయ్యేళ్ల క్రితం నిర్మించిన కట్టడాలకు మరమ్మతుల పేరుతో అసలేం చేస్తున్నారో బయటకు రావాలని అన్నారు. స్వామి వారి తిరువాభరణ నగలన్నీ ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అసలు నగలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి.. ఎన్ని ఉన్నాయి.. ఎన్ని నగలు కనిపించకుండా పోయాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ వేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని రమణదీక్షితులు హెచ్చరించారు.

click me!