
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై వివాదాలు ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. వెన్నుపోటు పాటను తొలగించాలంటూ టీడీపీ నేతలు ఎంతమంది వర్మను ఎలా టార్గెట్ చేసినా వర్మ మాత్రం ఐ డోంట్ కేర్ అంటున్నారు.
అయితే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, దర్శకుడు రాంగోపాల్ వర్మల మధ్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయి వరకు వెళ్లిపోయింది ఇద్దరి మధ్య గొడవ.
వెన్నుపోటు పాట తొలగించాలంటూ ఎస్వీ మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు కోర్టును సైతం ఆశ్రయించారు. వెంటనే ఎస్వీ మోహన్ రెడ్డికి కౌంటర్ గా వర్మ లీగల్ నోటీసులు పంపించారు.
అందుకు ప్రతిగా ఎస్వీ మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తనపై కేసు పెట్టిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి వర్మ గట్టి సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించారన్న ఆరోపణలతో కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో మోహన్‌రెడ్డి దర్శకుడు వర్మపై ఫిర్యాదు చేశారు. వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ సినిమాలోని వెన్నుపోటు పాటలో చంద్రబాబును కించపరిచారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీస్ కంప్లైంట్ పై వర్మ గట్టిగానే స్పందించారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎన్టీఆర్‌పై ఎందుకు కేసు పెట్టలేదని ఎస్వీ మోహన్‌రెడ్డిని ట్విటర్‌లో నిలదీశారు. ఎన్టీఆర్ బతికుండగా ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.
మెుత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ముందే సంచలనంగా మారింది. సినిమా విడుదల లోపు ఇంకెన్ని సంచలనాలు చూడాల్సి వస్తుందో ఇంకెంత రచ్చ జరుగుతుందోనని ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మర్డర్ కేసులే ఎదుర్కొన్నా, నీ నోటీసులు ఓ లెక్కా: వర్మకు ఎమ్మెల్యే వార్నింగ్
లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట: ఎమ్మెల్యేకు వర్మ లీగల్ నోటీసు