కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Nov 20, 2022, 1:26 PM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు.

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై పోసాని  కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో యందం ఇందిరా రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఇందిర రాజమహేంద్రవరం రెండో జెఎఫ్‌సీఎం కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. పోసాని  కృష్ణ మురళిపై కేసు నమోదు  చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీసులు పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక, పోసాని కృష్ణ మురళి గత కొన్నేళ్లుగా వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్‌కు మద్దతుగా  మాట్లాడటమే కాకుండా.. ఆయన వ్యతిరేకులపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ పోసానికి సీఎం జగన్ ఏదో ఒక పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే ఎట్టకేలకు ఇటీవలే పోసానికి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పోసానిని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. 

click me!