రైల్వేస్టేషన్లలో మహిళల భద్రతకు పటిష్టచర్యలు: ఏపీ మహిళా కమిషన్ కు రైల్వే డిఐజి నివేదిక

Arun Kumar P   | Asianet News
Published : May 30, 2022, 04:07 PM IST
రైల్వేస్టేషన్లలో మహిళల భద్రతకు పటిష్టచర్యలు:  ఏపీ మహిళా కమిషన్ కు రైల్వే డిఐజి నివేదిక

సారాంశం

ఇటీవల ఏపీలోని పలు రైల్వేస్టేషన్లలో మహిళపై అఘాాయిత్యాలు జరిగిన నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే మహిళా భద్రతపై చేపట్టిన చర్యలను వివరిస్తూ రైల్వే పోలీసులు ఏపీ మహిళా కమీషన్ కు నివేదిక అందించారు.     

అమరావతి: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లోని పలు రైల్వేస్టేషన్లలో మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో రైల్వే స్టేషన్లలో మహిళా భద్రతపై ఏపీ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టామని దక్షిణ మధ్య రైల్వే పోలీసులు రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించారు. 

సోమవారం మహిళా కమిషన్ కార్యాలయంలో ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను దక్షిణ మధ్య రైల్వే డీఐజీ రమేష్ చంద్ర, గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం ఆర్. శ్రీనివాసులు, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ కె. హరప్రసాద్ భేటీ అయ్యారు. ఇటీవల పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని గురజాల, రేపల్లె రైల్వేస్టేషన్లలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించి మహిళా భద్రతపై రైల్వేపోలీసు శాఖకు నోటీసులు పంపింది. శాఖాపరమైన చర్యలను బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై మహిళా కమిషన్ కు వివరించాలని నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు గురజాల, రేపల్లె ఘటనలపై రైల్వే పోలీసులు వివరణ ఇచ్చారు. రైల్వే స్టేషన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో తాము చేపట్టిన భద్రతా చర్యలపై దృష్టి పెట్టామన్నారు. గస్తీ, పెట్రోలింగ్‌ షిఫ్ట్‌ విధానం, సిబ్బంది వివరాలను వాసిరెడ్డి పద్మ అడిగి తెలుసుకున్నారు. 

Video

లోకల్‌ పోలీసు, జిఆర్‌పి, రైల్వే పోలీసులు సమన్వయం చేసుకుంటూ రాత్రి, పగలు గస్తీ మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పద్మ సూచించారు. నిర్మానుష్యమైన ప్రదేశాల్లో పెట్రోలింగ్‌ వాహనాలు గస్తీ నిర్వహించి, ప్రయాణికులకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. సిసి కెమెరాల ద్వారా ప్రయాణికుల రాకపోకలు గమనించాలని సూచించారు. సిసి కెమెరాలు లేని చోట వెంటనే వాటిని అమర్చాలని సూచించారు.  వీటి ద్వారా అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టి, నేరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. 

ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రైల్వేస్టేషన్లలో సంబంధిత పోలీస్‌ అధికారులు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆమె సూచించారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘాపెట్టాలని... నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అందరూ సమష్టిగా కార్యాచరణ రూపొందించాలని వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. 

ప్రతి రైల్వే స్టేషన్‌ పరిధిలో రాత్రిపూట గస్తీలు అమలయ్యేలా బీట్లు వేయాలని పోలీసు అధికారులను మహిళా కమీషన్ చైర్ పర్సన్ ఆదేశించారు. భవిష్యత్తులో ఆర్పీఎఫ్, సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలకు మహిళా కమిషన్ భాగస్వామ్యం కావాలని రైల్వే ఉన్నతాధికారులు కోరగా అందుకు వాసిరెడ్డి పద్మ సుముఖత వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

మాట్లాడుతూనే ఉంటా.. దేనికైనా రెడీ! | Professor Nageshwar Strong Reaction | Asianet News Telugu
చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ తెలుగు తమ్ముళ్లకు పూనకాలే | Mahanadu2026 | Asianet News Telugu