
Monsoon: దేశవ్యాప్తంగా పంటల సాగుకు కోసం చూస్తున్న రైతన్నలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఖరీఫ్ సాగుకు ఎంతో ప్రధానమైన నైరుతి రుతుపవనాలు ఆదివారం కేరళను తాకాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ కంటే.. మూడు రోజుల ముందే నైరుతి రుతు పవనాలు (monsoon) కేరళను తాకినట్టు వెల్లడించింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియాకు వెల్లడించారు.
ఇంకా నైరుతి రుతుపవనాలు ..దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం, కేరళ, దక్షిణ తమిళనాడు,మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని పేర్కొంది.రానున్న 3, 4 రోజుల్లో కేరళలో మిగిలిన ప్రాంతాలు, మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడులో కొన్ని ప్రాంతా లు, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా..మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. మే రెండో వారంలో బంగాళాఖాతంలో ‘అసాని’ తుఫాన్ సంభవించడంతో రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అరేబియా సముద్రం నుండి దక్షిణ భారత ద్వీపకల్పం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో వెలువడే పశ్చిమ గాలుల ప్రభావంతో తుఫాను, భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
తొలుత రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతం కురవనుంది. వర్షపాతం 96 నుంచి 104 శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే జూన్ 3 నాటికి రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించవచ్చని ఐఎండీ అమరావతి, కరుణ సాగర్ వాతావరణ అధికారి తెలిపారు.
రానున్న రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని, ఆశించిన తేదీకి అనుగుణంగా రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌పై స్థిరపడకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు.ఆదివారం చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయని, మచిలీపట్నంలో అత్యధికంగా 43.21 డిగ్రీల సెల్సియస్, కాకినాడ 41.0 డిగ్రీలు, గన్నవరంలో 43.9 డిగ్రీలు, అమరావతి 43.4 డిగ్రీలు నమోదు అయినట్టు తెలిపారు. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.