
ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు వైయస్ జగన్ ను భగవంతుడితో పోల్చడమా? అని మండిపడ్డారు. రుషి కొండకు గుండు కొట్టించి అక్రమంగా ఇల్లు కట్టుకున్న వ్యక్తిని దేవుడితో పోల్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఋషికొండపై జగన్ అక్రమ భవనాన్ని.. తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీశైలం కొండపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాలతో మంత్రులు పోల్చడాన్ని దుయ్యబట్టారు. ఇది చూస్తుంటే మంత్రులకు మతి పోయినట్టు స్పష్టమవుతుందన్నారు.
రఘురామకృష్ణంరాజు సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఋషికొండపై టూరిజం కాటేజీల ముసుగులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్మించిన అక్రమ భవనం సిఆర్ జెడ్ జోన్ పరిధిలోకి వస్తుంది. తిరుమల, శ్రీశైలం కొండలు సముద్రానికి దగ్గరగా లేవు. మంత్రులకు ఆ జోన్ లో కొన్ని నిబంధనలు ఉంటాయన్న అవగాహన కూడా లేదు. వారు చేసిన వ్యాఖ్యలు జ్ఞాన శూన్యతకు అర్థం పడుతున్నాయి.
కాకినాడ జిల్లా వెలమకొత్తూరులో విషాదం: నాటు తుపాకీ తూటా తగిలి నాలుగేళ్ల బాలిక మృతి
వైయస్ జగన్ నిర్మాణం చేపట్టిన ఋషికొండ నిర్మాణాల్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ భవన సముదాయంలో నాలుగు బ్లాకులకు 4 పేర్లు పెట్టారు. వ్యక్తిగత క్యాంపు కార్యాలయం, ముఖ్యమంత్రి నివాస సముదాయం, కార్యదర్శుల కార్యాలయాలను నిర్మించారు. అయితే, అక్కడ కట్టింది ముఖ్యమంత్రి నివాస భవన సముదాయమే. అది కాదు అనే పక్షంలో నిజమెంటో నిరూపించాలి.
టూరిజం కార్యకలాపాలకు రుషికొండపై నిర్మించిన నిర్మాణాలకు ఎలాంటి సంబంధము లేదు. ఈ భవన సముదాయాన్ని భార్యాభర్తల పేరు మీద కాకుండా.. వేరొకరి పేరు మీద 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చి.. ఆ తర్వాత వారి దగ్గర నుంచి భార్యాభర్తలిద్దరూ కొద్దికాలం పాటు అద్దెకు తీసుకుంటున్నట్లుగా… ప్రజల్ని నమ్మించే కుట్ర జరుగుతోంది. ఈ మేరకు వార్తా కథనాలు వినిపిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉన్నప్పుడు విశాఖలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ఋషికొండపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త కాపురం కోసం టూరిజం కాటేజీల ముసుగులో నిర్మించుకున్న భవనాలను కూడా కూల్చేయాలి. రేపు కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకోవాలి.
రూ.వందకోట్లు ఈ భవనాల నిర్మాణం కోసం ఖర్చుపెట్టినట్లుగా చెబుతున్నారు. ప్రజలు లక్షల కోట్ల రూపాయలను ఈ పాలకుల వల్ల నష్టపోయారు. ఇలాంటి పనికిమాలిన పాలకులకు గుణపాఠం కావాలి. అలా రావాలంటే ఇలాంటి అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే’ అంటూ రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుత ఏపీ పాలక పార్టీ ఋషికొండపై సెక్రటేరియట్, సెక్రటరీల భవన సముదాయాలను నిర్మిస్తున్నామని ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ ను తరువాత తొలగించింది. దీనికి కారణం కోర్టు ధిక్కరణ కింద అడ్డంగా దొరికిపోతామనే’ అంటూ రఘు రామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు.