స్పీకర్‌ సీట్‌లో రఘురామ... జగన్‌ అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది?

By Galam Venkata Rao  |  First Published Jun 5, 2024, 6:55 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సంచలన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉండిలో కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రఘురామ కృష్ణ రాజు అసెంబ్లీ స్పీకర్ అయితే ఎలా ఉంటుంది.. ఆర్ఆర్ఆర్ స్పీకర్ సీట్లో కూర్చుంటే... 11 సీట్లకే పరిమితమైన జగన్ అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది.... 


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పర్వం సర్వం ఉత్కంఠభరితంగా సాగింది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో సంచలన విజయం సాధించింది. ఇక, జూన్ 12న అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే జూన్ 9న విశాఖలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రులు, వైసీసీ నేతలు ఫలితాల ముందు వరకు చెబుతూ వచ్చారు. వైసీపీ అనుకున్న 9వ తేదీనే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ఇక, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చంద్రబాబు కేబినెట్‌లో ఎవరికి ఏ పదవి దక్కుతున్న చర్చ జోరుగా సాగుతోంది. 
 
ఆర్‌ఆర్ఆర్‌ స్పీకర్‌ అయితే.... 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించడం ఒక ఎత్తయితే.. ఉండిలో టీడీపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు గెలుపొందడం ఒక ఎత్తు. 2019లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీ ఎన్నికైన ఆయన కొద్దిరోజుల్లోనే ఆ పార్టీకి దూరమయ్యారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులు తాళలేక ఢిల్లీకి మకాం మార్చారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే... జగన్‌కి, ఆయన పార్టీకి చుక్కలు చూపించాడని చెప్పవచ్చు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎత్తిచూపుతూ ఒక రేంజ్‌లో ట్రోల్‌ చేశారు. వైసీపీ, దాని సోషల్‌ మీడియా సైన్యం దాడులను తట్టుకుంటూనే ప్రతినిత్యం కౌంటర్‌ దాడులు చేశారు. ఈ క్రమంలో టీడీపీ దగ్గరయ్యారు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహించిన సభలో ఇరు పార్టీల అధినేతల కంటే ముందే.. తాను కూటమి తరఫున పోటీ చేస్తానని ఆర్ఆర్ఆర్ ప్రకటించారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నడుమ రఘురామ కృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం బరిలో దిగి విజయం సాధించారు. 

ఇప్పుడు రఘురామకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. గత ఐదేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ను ఇబ్బందులు పెడుతూ వచ్చిన జగన్‌... ఆయన్ను అధ్యక్ష అంటూ అసెంబ్లీ మాట్లాడుతుంటే చూడాలంటూ ఓ వర్గం సోషల్‌ మీడియాలో చర్చిస్తోంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని వైసీపీని టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఏ రేంజ్‌లో ఆడుకుంటాయి. ప్రతిపక్షాన్ని, చంద్రబాబును గతంలో పెట్టిన ఇబ్బందులకు ఎలాంటి రివేంజ్‌ ఉంటుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన జగన్‌ పార్టీ.. ఈసారి 11 సీట్లకు పరిమితం అయింది. ఇది జగన్‌ ఘోర పరాజయం. ఈ నేపథ్యంలో జగన్‌ అసలు అసెంబ్లీకి వెళతారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. 

Latest Videos

click me!