జగన్ విజయంలో వారిద్దరిది కీలకపాత్ర, షర్మిలకు సగం ఆస్తిని ఇవ్వాలి.. అంబటికి గుర్తింపేది: రఘురామ సంచలనం

By Siva KodatiFirst Published Aug 12, 2021, 4:35 PM IST
Highlights

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విజయంలో వైఎస్ షర్మిల, అంబటి రాంబాబు కీలకపాత్ర పోషించారని అందువల్ల షర్మిలకు సగం ఆస్తిని ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ సోదరి షర్మిల పాత్ర కూడా ఉందని ఆయన గుర్తుచేశారు. పార్టీ గెలుపు కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని, గొప్పగా ప్రచారం చేశారని ప్రశంసించారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని రఘురామ అన్నారు. జగన్ తనకున్న ఆస్తిలో సగ భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని ఆయన సూచించారు. వైసీపీ విజయంలో సగం పాత్రను పోషించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వడమే న్యాయమని రఘురామ అభిప్రాయపడ్డారు. అలాగే వైసీపీ విజయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని చెప్పారు. న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన అంబటి స్వతహాగా మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి అని .. పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఇవ్వాలని  రఘురామ కృష్ణంరాజు సూచించారు.

అంతకుముందు ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల నిధులపై వైసీపీ ప్రభుత్వం గురిపెట్టిందని ఆరోపించారు. వెంకన్ననూ వదలడం లేదని, ‘మా దేవుడిని వదిలేయమని వేడుకుంటున్నానంటూ రఘురామ అన్నారు. టీటీడీ నుంచి ప్రస్తుతం ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇక నుంచి ఏటా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. వెంకన్న నగలు కూడా అమ్మేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందని ఆరోపించారు. స్వామివారి ఆస్తులను ముట్టుకోవద్దంటూ భక్తులందరూ కలిసి సీఎంకు వినతిపత్రం పంపిద్దామని రఘురామ పిలుపు ఇచ్చారు.

Also Read:శ్రీవారి నగలు అమ్మేస్తారేమో.. మా వెంకన్నను వదిలేయండి: రఘురామ సంచలన వ్యాఖ్యలు

ఇదే సమయంలో తాను ఎక్కడా షెడ్యూల్ 10ని ఉల్లంఘించలేదని ఎంపీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలను కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. న్యాయశాఖ మంత్రిని కలిసి ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని, చట్టానికి సవరణలు చేయాలంటూ వైసీపీ ఎంపీలు కోరారని రఘురామ గుర్తుచేశారు.

click me!