
క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఇప్పటికే చేసిన ఎంఓయూకు (MoU) ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్న టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం వంటి అగ్రశ్రేణి సంస్థలు శాస్వత నిర్మాణ పనులకు సిద్ధమయ్యాయి.
ఈ పార్క్‌లో ముఖ్యాకర్షణగా నిలవబోయేది ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనున్న 156 క్యూబిట్ల క్వాంటం సిస్టమ్ 2. ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ పరికరం అవుతుంది. ఈ వ్యవస్థ ద్వారా పరిశోధన, డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ ఆధారిత సేవలు మరింత వేగంగా, ఖచ్చితంగా చేయగలుగుతాయి.
టీసీఎస్ సంస్థ, ఈ పార్క్ ద్వారా క్వాంటం సర్వీసెస్, హైబ్రీడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్ అందించనుంది. విద్య, ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో పరిశోధన, అనువర్తనాల అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కానుంది. అలాగే ఎల్ అండ్ టీ మాత్రం స్టార్టప్ సపోర్ట్, క్లైంట్ నెట్‌వర్క్ అభివృద్ధి, ఇంజనీరింగ్ నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించనుంది.
ఈ క్వాంటం వ్యాలీ పార్క్ ద్వారా అమరావతిలో వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. క్వాంటం టెక్నాలజీతో పాటు ఇతర ఐటీ సేవలకూ డిమాండ్ పెరిగేలా, యువతకు నూతన అవకాశాల వేదికగా మారనుంది. దీని ప్రభావంతో విశాఖపట్నం, తాడేపల్లి, మంగళగిరి వంటి నగరాల్లో ఐటీ రంగం మరింత విస్తరించనుంది.
పునరుద్ధరించిన రాజధాని నిర్మాణంలో ఐటీ రంగం కీలక పాత్ర పోషించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, అమరావతిని దేశంలోనే ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ టెక్ పార్క్‌తో అమరావతి భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.