
వైసీపీ ఎమ్మెల్యే రోజా కి ఏమైంది? ఇప్పుడంతా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆమె మీడియా ముందుకు రావడం లేదు. దీంతో.. పలువురు ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంధ్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి ఆమె మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. కేవలం ఆమె సొంత నియోజకవర్గం నగరిలో మాత్రమే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.
నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో, అంతకుముందుకు కూడా తరచూ అధికార పార్టీ, సీఎం చంద్రబాబుపై ఏదో ఒక విషయంపై రోజా విమర్శలు చేస్తూనే ఉండేవారు. కానీ ఫలితాల అనంతరం ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. రోజా ఇలా సైలెంట్ అయిపోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను సైలెంట్‌గా ఉండమన్నారా? అనే సందేహం కలుగుతోంది.
నంధ్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధిస్తామని వైసీపీ భావించింది. ఆ నమ్మకంతోనే జగన్.. చంద్రబాబుపై , రోజా మంత్రి అఖిల ప్రియపై అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగిస్తూ మాటల యుద్ధానికి దిగారు. కేవలం వారి దుందుడుకు తనంతో చేసిన వ్యాఖ్యల వల్లే.. ఎన్నికల్లో ఓడిపోయామంటూ పలువురు వైసీపీ నేతలు భావిస్తున్నారట.
అంతేకాకుండా రోజా వ్యాఖ్యల వల్లే ఇలా జరిగిందని పార్టీ అధిష్టానం కూడా గట్టిగా నమ్మిందని.. అందుకే ఆమెను కొద్ది రోజులు మీడియాకు దూరంగా ఉండమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రోజా ప్రస్తుతం తన నియోజకవర్గం నగరిపైనే దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ప్రజల మధ్య గడుపుతున్నారు.