
పాలనాపరమైన వివిధ అంశాల్లో ఏపి స్ధానం ఏమంత సంతృప్తికరంగా లేదని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ విడుదల చేసిన ఇండెక్స్ తేల్చింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాల నేపథ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల పాలనా తీరుపై సర్వే చేసి ఫలితాల8 విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సర్వే ఫలితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాలనాపరమైన అంశాల్లో వెనుకబడే ఉన్నట్లు స్పష్టమైంది. 10 నేపథ్యాలు, 26 కీలక విషయాలు, 82 సూచికల ఆధారంగా ఈ సంస్థ మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించింది.
అవసరమైన మౌలిక వసతులు, మానవ అభివృద్ధికి మద్దతు, సామాజిక రక్షణ, మహిళలు–పిల్లలు, న్యాయపరిష్కార సేవలు, నేరాలు–శాంతిభద్రతలు, పర్యావరణం, పారదర్శకత–జవాబుదారీతనం, ద్రవ్య నిర్వహణ, ఆర్థిక స్వేచ్ఛ అంశాలను పరిశీలించి ర్యాంకులు ఇచ్చింది. రెవెన్యూ లోటు, మిగులు, ద్రవ్య మిగులు, రుణ భారం, తలసరి అభివృద్ధి వ్యయం, రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం పెరుగుదల తదితర విషయా లతో కూడిన ‘ద్రవ్య నిర్వహణ’లో రాష్ట్రం 28వ స్థానంలో నిలిచింది.
పారిశ్రామిక ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన తదితర అంశాల్లో 4వ స్థానంలో నిలిచింది. విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, గృహ నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పనలో 6వ స్ధానం దక్కింది. విద్య, ఆరోగ్యం తదితర అంశాలతో కూడిన మానవాభివృద్ధికి చేయూతలో 17వ స్థానం దక్కించుకుంది.
ప్రజాపంపిణీ వ్యవస్థ, సామాజికన్యాయం–సాధికారత, మైనారిటీల సంక్షేమం, ఉపాధి కల్పన తదితర సామాజిక భద్రత అంశంలో 24వ స్ధానంలో నిలిచింది. పిల్లలపై నేరాలు, బాలకార్మికులు, ఐసీడీఎస్ లబ్ధిదారుల శాతం, లింగ నిష్పత్తి, పౌష్టికాహార లోపం, ఆసుపత్రుల్లో ప్రసవాలు తదితర మహిళలు–పిల్లలు అంశంలో 19వ స్ధానంలో ఉంది. అత్యాచారాలు, హత్యలు, వరకట్న బాధిత చావులు, కస్టోడియల్ మరణాలు, పోలీసు సిబ్బంది సంఖ్య తదితర విషయాలను పరిశీలించే నేరాలు, శాంతిభద్రతలు అంశంలో 11వ స్ధానం దక్కించుకుంది.
కేసుల పెండింగ్, న్యాయాధికారుల ఖాళీలు, అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తదితర అంశాలతో కూడిన న్యాయసేవలపరిష్కారంలో 23వ స్ధానంతో వెనకబడివుంది. కాలుష్యం, పర్యారణఉల్లంఘనలు, అటవీ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి వంటి అంశాల్లో 20వ స్ధానంతో సరిపెట్టుకుంది. ఈ–గవర్నెన్స్ సేవలు, ఆర్‌టీఐ, లోకాయుక్త చట్టం, ఏసీబీ కేసుల పరిష్కారం, ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డులు తదితర విషయాలపై పరిశీలన చేసిన ‘పారదర్శకత, జవాబుదారీతనం’ అంశంలో 23వ స్ధానంలో నిలవటం గమనార్హం.