అమరావతికి కౌంటర్: ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు శ్రీకారం

By Siva KodatiFirst Published Aug 28, 2020, 9:53 PM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే అది చేసే వరకు వెనకడుగు వేయడం కష్టం. తను అనుకున్నది చేయడానికి ఆయన ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే అది చేసే వరకు వెనకడుగు వేయడం కష్టం. తను అనుకున్నది చేయడానికి ఆయన ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

కానీ... మండలిలో బిల్లు గట్టెక్కకపోవడం, హైకోర్టులో కేసులతో ‘పైకి’ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. తెరవెనుక మాత్రం ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది.

అమరావతి రైతుల ఆందోళనలు, శాసన సంబంధ అడ్డంకులు, న్యాయ వివాదాలు, కరోనా కేసులు... ఇలా ఏమున్నా సరే, తమ దారి తమదే అన్నట్లుగా మూడు రాజధానుల విషయంలో కూడా జగన్ ముందుకు వెళ్లేందుకే నిర్ణయించారు.

పాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే న్యాయ పరమైన చిక్కులు జగన్‌ స్పీడుకు బ్రేకులు వేస్తున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అమరావతి జేఏసీ హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ పిటిషను విచారించిన హైకోర్టు రాజధాని తరలింపును ఆపుతూ స్టే ఇచ్చింది. ఇప్పటికే రెండోసారి స్టే ఇచ్చింది. ఈ స్టేను రద్దు చేయమని, లేదా స్టే పై స్టే ఇవ్వమని ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషను వేసింది.

దీనిని విచారించిన సుప్రీం హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు - హైకోర్టులో రేపే విచారణ ఉన్నందున మా వద్దకు రావడం సరికాదు అని చెప్పింది.

నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించాలని ఏపీ హైకోర్టుకు ఆదేశించమని  ఏపీ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫలానా గడువులోపు విచారణ ముగించాలని మేం ఆదేశించలేము అంటూ సుప్రీం కోర్టు పేర్కొంది.

కానీ చట్టానికి చిక్కకుండా, కోర్టులకు దొరక్కుండా.. అమరావతిని ‘అలాగే’ ఉంచి... క్రియాశీల రాజధానిని మాత్రం విశాఖకు తరలించే ప్రయత్నాలు గుంభనంగా జరుగుతున్నాయి.

ఇదే సమయంలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేట్‌సకో కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రభుత్వం విశాఖ జిల్లా కాపులుప్పాడలో అతిథిగృహం నిర్మిస్తోందంటూ గుంటూరు జిల్లా మందడం గ్రామానికి చెందిన కొందరు పిటిషన్ దాఖలు చేశారు.

గ్రేహౌండ్స్‌కు కేటాయించిన భూమిలో చేపట్టనున్న ఈ నిర్మాణం కూడా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటులో భాగమేనని, అందువల్ల దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకోవాలని అభ్యర్థించారు.

Also Read:విశాఖలోస్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు: కోర్టులో విచారణ జరిగిన గంటలోనే జీవో

దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ పిటిషన్‌పై రెండువారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎ్‌సతో పాటు మిగిలిన ప్రతివాదులనూ ఆదేశించింది. ‘స్టేట్‌స్‌కో’ అంటే నిర్మాణాలకూ వర్తిస్తుందని స్పష్టంచేసింది.

న్యాయ పరమైన పోరాటాన్ని కొనసాగిస్తూనే రాజధాని రైతులు వ్యక్తిగతంగాను ధర్నాలు, ఆందోళననలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులు అన్న మాట జగన్ నోటి వెంటనే వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంటే సుమారుగా 250 రోజులకు పైగా రైతులు ఏమాత్రం విసుగు లేకుండా నిరసన కొనసాగిస్తున్నారు.

కరోనా లేకుంటే రైతుల ఆందోళన మరింత ఉద్ధృతంగా సాగేదన్నది కాదనలేని వాస్తవం. వీరి తీరు చూస్తుంటే జగన్ నిర్ణయాన్ని మార్చుకునే వరకు వెనకడుగు వేసేదే లేదన్నట్లుగా వుంది.

అదే సమయంలో విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనంటూ వైసీపీ కార్యకర్తలు ఉత్తరాంధ్రలో ఆందోళన ఉద్ధృతం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు విశాఖకే పరిమితమైన నిరసనలను క్రమంగా ఉత్తరాంధ్ర అంతటా విస్తరింపజేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

తద్వారా అమరావతిలో రైతుల ఉద్యమానికి కౌంటర్ ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. శుక్రవారం సైతం విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం కంచరపాలెం కప్పరాడ,సంజీవయ్య కోలని కొండపై ఉన్న జాతీయ జెండా వద్దకు వెళ్ళి ప్లకార్డులు,జెండాలను ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ నేపథ్యంలో అమరావతి రైతులు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. 

click me!