
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన క్యాంపు సైట్‌లో బస చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు పలువురు కుటుంబ సభ్యులు అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులను ప్రముఖ సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు పరామర్శించారు.
ఆ తర్వాత ఆదిశేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరినీ సీఎంలుగా చూశానని చెప్పారు. అయితే వారి మద్య ఈ తరహా కక్ష సాధింపు రాజకీయాలు లేవని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో కొత్త తరహా కక్ష రాజకీయాలు చూస్తున్నామని చెప్పారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమం అని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.