
కడప: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ (MV Ramana Reddy) రమణారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.
ఆయన వయస్సు 80 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎంవీ రమణారెడ్డి కర్నూల్‌లోని (kurnool) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
గుంటూరు లో ఆయన మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాడు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఎంవీ రమణారెడ్డి ఒకరు. గుంటూరులో ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే ఆయన కవిత అనే మాసపత్రికను ప్రారంభించారు.ఆ తర్వాత ప్రభంజనం అనే పక్షపత్రికను కూడ ఆయన నడిపారు.
1983లో ఆయన ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలం పాటు టీడీపీలో కొనసాగారు. రాయలసీమ అభివృద్ది కోసం ఆయన పరితపించాడు ఈ విషయమై ఎన్టీఆర్ తో ఆయన విబేధించారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు. రాయలసీమ అభివృద్ది కోసం ఆయన పాదయాత్ర కూడా చేశారు.
ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీ రమణారెడ్డి పోటీలో ఉన్న అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపేవారు. దీంతో ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్ధులు ఎంవీ రమణారెడ్డి మద్దతు కోసం ప్రయత్నించేవారు.