
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆడియో ఫంక్షన్ల నుంచి సోషల్ మీడియా వరకు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారం నుంచి మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతూ గంట గంటకూ కొత్త మలుపు తీసుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనపై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం- పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంగళవారం పాలసీ టెర్రరిజం ఆఫ్ ఏపీ అనే పేరుతో పవన్ మరో ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన... విధానపరమైన తప్పిదాలను ప్రస్తావించారు. ఏపీ ఫర్ సేల్ అంటూ పవన్ కామెంట్ చేశారు. ఏపీ ఎస్‌డీసీ పేరుతో రూ.25 వేల కోట్ల రుణం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో సంపద సృష్టి లేదని.. ఏపీకి నవ కష్టాలంటూ మరో ట్వీట్ చేశారు.
అంతకుముందు ఉదయం ”హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?” ”ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!” అంటూ పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.