
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు బాట పడుతోంది. ప్రభుత్వ శాఖల ఆస్తులను, శాఖల్లోని కొన్ని సేవలను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని శాఖల ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వం మరికొన్నింటిని కూడా ప్రైవేటు పరం చేయటానికి అత్యుత్సాహం చూపుతుండటం ప్రజలను విస్తుగొలుపుతోంది. ఈ విషయమై ప్రతిపక్షాలు ఎంత రాద్దాంతం చేసినా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకపోవటం గమనార్హం.
తాజాగా వైద్య ఆరోగ్యశాఖలోని కొన్ని ఆస్తులను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. ఏలూరు, రాజమండ్రి, హిందుపురంలో ఉన్న ప్రభుత్వ ఆసుప్రతుల ప్రాంగణాల్లోని స్ధలాలను ప్రైవేటు పరం చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే దాదాపు పూర్తి చేసినట్లు చెప్పారు.
గతంలోనే చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను ఓ కార్పొరేట్ ఆసుపత్రికి 33 ఏళ్ళకు లీజుకు కట్టబెట్టిన సంగతి అందరికీ విధితమే. మొదట్లో 99 ఏళ్లకు లీజు అన్నారు గానీ వివిధ వర్గాల నుండి ఎదురైన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకున్నప్రభుత్వం లీజు కాలాన్ని 33 ఏళ్ళకు కుదించింది. తాజాగా మరో మూడు ఆసుపత్రుల్లోని ఖాళీ స్ధలాలను అని చెబుతున్నా త్వరలో మొత్తం ఆసుపత్రులనే ఇచ్చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
ఇదే పద్దతిలో రాష్ట్రం మొత్తంలోని ఆర్టీసికి చెందిన ఖాళీ స్దలాలను ప్రైవేటు పరం చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు పరం చేయటానికి అనువుగా ఉన్న ఆర్టీసీ స్దలాల వివరాలను కూడా సేకరించింది. రాష్ట్రం మొత్తం మీద 106 ఆర్టీసి స్ధలాలను ప్రైవేటు పరం చేయటానికి రంగం కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగానే మొదటగా విజయవాడ నడిబొడ్డునున్న ఆర్టీసీ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉందన్న పేరుతో పెద్ద స్ధలం ప్రైవేటువ్యక్తుల పరమైపోయింది. ఇక వివిధ శాఖల్లోని పారిశుధ్య పనులన్నింటినీ ప్రైవేటు సంస్ధలే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.