
చదువుకున్న వారు, ఉపాధ్యాయ ఓటర్లకు నిర్వహించిన ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ఓటు వేసే విసయమై నిర్లిప్తత కనిపించింది. చదువుకున్న వారికి నిర్వహించిన ఎన్నికల్లో కూడా నూరు శాతం ఓట్లు పోలవ్వకపోతే ఎలా? రాష్ట్రంలోని ఐదు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఉత్తరాంధ్రుల పట్టభద్రుల నియోజకవర్గంలో 69 శాతం ఓట్లే పోలయ్యాయి. చివరకు మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు కూడా ఓటు వేయలేదట. ప్రకాశం జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 71 శాతం నమోదయ్యాయి. ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం 91 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నెల్లూరు జిల్లాలో పట్టభద్రులు 64 శాతం, ఉపాధ్యాయులు 87 శాతం హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో పట్టభద్రులు 65 శాతం, ఉపాధ్యాయులు 83 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పట్టభద్రులు 68 శాతం, ఉపాధ్యాయులు మాత్రం 93 శాతం ఓట్లసారు. కడపలో ఉపాధ్యాయులు 94 శాతం పాల్గొనగా, పట్టభద్రులు మాత్రం కేవలం 57 శాతమే ఓటేసారు. కర్నూలు జిల్లాలో పట్టభద్రులు 63 శాతం ఓట్లు వేయగా ఉపాధ్యాయులు 92 శాతం ఓట్లేసారు.
సమాజాన్ని చైతన్య పరచాల్సిన బాధ్యత విద్యావంతులదే. అటువంటి వారు కూడా చాలా చోట్ల సరిగా స్పందించలేదు. ఇక, పట్టభద్రుల్లో కనబడతున్న నిర్లిప్తతకు కారణాలు తెలీలేదు. సగటున 60 శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవటం గమనార్హం. ఎక్కడైనా ఉపాధ్యాయుల కన్నా చదువుకున్న వారి ఓట్లే ఎక్కువుంటాయి. చదువుకున్న వారి కోసం నిర్వహించే ఎన్నికల్లో కూడా ఎక్కడా నూరు శాతం ఓట్లు నమోదు కాకపోవటం విచిత్రం.