
నోట్ల రద్దు ప్రభావం తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుపై విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. కొందరు మంత్రులు, శాసనసభ్యులు, నేతలు భారతీయ జనతా పార్టీని వదలించుకోమంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
భాజపాతో ఇంకొంత కాలం కలసి ఉంటే పుట్టి ముణగటం ఖాయమంటూ ఎంఎల్ఏలు సిఎంకు స్పష్టం చేస్తున్నారట.
నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల వ్యతిరేకత తమపైన కూడా చూపుతున్నట్లు మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిలతో పాటు నేతలు కూడా చంద్రబాబు వద్ద మొరపెట్టుకుంటున్నారు.
మోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు లబ్ది చేకూరే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్నవిషయాన్ని పలువురు మంత్రులు, ఎంఎల్ఏలు చంద్రబాబుకు గుర్తు చేస్తున్నట్లు సమారం. నోట్ల రద్దు లాంటి నిర్ణయాన్నిఏకపక్షంగా తీసుకోవటంతో టిడిపి దాన్ని భరించాల్సి వస్తోందని నేతలు సిఎం వద్ద వాపోతున్నారు.
గడచిన రెండున్నర ఏళ్ళుగా కేంద్రం నుండి రాష్ట్రానికి ఆశించిన స్ధాయిలో ఒక్క విషయంలో కూడా మద్దతు అందని వైనాన్ని కూడా నేతలు ఎత్తి చూపుతున్నారు. చివరకు విభజన చట్టంలో పేర్కొన్న రెవిన్యూ లోటును కూడా కేంద్రం భర్తీ చేయలేదని, పోలవరం, అమరావతి నిర్మాణాలకు అవసరమైన నిధులు కూడా మంజూరు చేయని విషయాన్ని కూడా నేతలు సందర్భం వచ్చినపుడల్లా చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు.
ఎంఎల్ఏలు, నేతలు చెప్పేదంతా బాగానే ఉంది. కేంద్రం నుండి రాష్ట్రాభివృద్ధి విషయంలో పెద్దగా సహకారం అందని మాట వాస్తవమే. విభజన చట్టంలో పేర్కొన్నట్లు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ తదితర విషయాలను కూడా కేంద్రం పట్టించుకోని మాటా నిజమే.
వారు చెబుతున్నట్లుగా చంద్రబాబు భాజపాకు రాం రాం చెప్పేస్తారనుకుందాం. ఆ తర్వాత పరిస్ధితులు ఎలాగుంటాయో వారు ఆలోచించారో లేదో. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే బయట పడ్డ ‘ఓటుకునోటు’ కేసు మాటమేటన్నదే ప్రశ్న. పై కేసులో ఇంతకాలం చంద్రబాబు క్షేమంగా ఉన్నారంటే కేవలం మోడి అండతోనే కదా.
మిత్రపక్షంగా వైదొలగిన తర్వాత చంద్రబాబు విషయంలో కేంద్రం అడ్డం తిరిగితే పరిస్ధితులు ఎలాగుంటాయి? ఆ విషయాలు తెలిసిన వారు కాబట్టే చంద్రబాబు కూడా మౌనంగా భాజపాను భరిస్తున్నారు. భాజపాను ఎప్పుడు ఒదిలేయాలో, ఎప్పుడు పట్టుకోవాలో 40 ఇయర్స్ ఇండస్ట్రి నిప్పు చంద్రబాబుకు ఆమాత్రం తెలీదా?