గోరంట్ల మాధవ్ వ్యవహారం : స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. ఎంపీపై చర్యలకు సూచన...

Published : Aug 30, 2022, 06:45 AM IST
గోరంట్ల మాధవ్ వ్యవహారం : స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. ఎంపీపై చర్యలకు సూచన...

సారాంశం

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు మహిళా నేతలు చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

ఢిల్లీ : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కలిసి అందజేసిన ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్ వుమెన్ జేఏసీ నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ తో పాటు జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఆమె కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా కలిసి రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని ఏపీ సిఎస్ కు పంపి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు లేఖలో పేర్కొంది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి  సమాచారం ఇస్తూ రాష్ట్రపతి కార్యాలయం  లెటర్ పంపించింది. గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్న వీడియో ఒకటి రాష్ట్రంలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారం‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు

కాగా, గోరంట్ల మాధవ్ వీడియోపై ఈ నెల రోజులుగా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో బైటికి రావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆగస్ట్ 18న స్పందించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సేవ చేయకుండా.. నీలి చిత్రాలు  చూపించారు అని విమర్శించారు. ఎంపీ ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

కాగా, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని తెలిసినా ఈ గొడవ చల్లారడం లేదు. దీనిమీద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆగస్ట్ 13న మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు తనను దేశద్రోహిగా చిత్రీకరించి.. చిత్రహింసలు పెట్టి.. ఊరికి రాకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న తమ పార్టీ ప్రభుత్వం.. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు 500కార్లతో  భారీ స్వాగతం పలకడం ఏమిటని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దేశం తమవైపు చూస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరుచూ చెబుతుంటారని, ఈ రకమైన ప్రోత్సాహంతో నిజంగానే దేశమంతా తమ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 

కాగా, రాష్ట్ర ప్రజలు, అక్క చెల్లెలు, తల్లులు సెల్ ఫోన్లు చూడొద్దని మొట్టమొదటిసారి విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ‘వాంటెడ్ పండుగాడు’ చిత్ర యూనిట్ విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఎంపీ గోరంట్ల మాధవ్ దిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్ స్పందించారు వరలక్ష్మీ వ్రతం ముందు రోజే వచ్చిన ఆ దరిద్రాన్ని తాను చూశానని అందుకే మిగిలిన వారిని చూడొద్దని చెప్పానని అన్నారు. దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ లేదన్నారు.  పార్లమెంటు అంటే పవిత్ర దేవాలయమని భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన సమరయోధులు ఎందరో అందులో కొలువై ఉన్నారని గుర్తు చేశారు. 

అలాంటి వాళ్ళు ఉండాల్సిన చోట ఇలాంటి వారు ఉన్నారని విమర్శించారు. ‘ గతంలో వారం రోజుల పాటు  నా మీద ప్రెస్ మీట్ పెట్టారు.. ఇప్పుడేవి?’  అని ప్రశ్నించారు.  ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్  లేదన్నారు. ‘అనంతపురం  ఎస్.పి  విలేకరుల సమావేశం పెడుతున్నట్లు ఆయనకు ఎలా తెలుసు? ఎస్పీ మాట్లాడుతున్నప్పుడే.. మాధవ్ ఢిల్లీలో మాట్లాడారు. ఇంగ్లాండ్ నుంచి అప్లోడ్ అయింది. ఎవరో చేశారు. ఒరిజినల్ క్లిప్ ను కనిపెట్టలేకపోయాం… అంటూ ఎస్పీ మాటలు చాలా దీనంగా ఉన్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు అరగంటలో వాస్తవం తేలుస్తారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూనే ఫేక్ అని తేల్చేశారు. వాళ్ల కోర్టులో అది ఫేక్ దేనని  తేలుతుంది’ అని పృథ్వీరాజ్ వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu