పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో గర్భిణీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే అత్తింటివాళ్లే తమ కూతురు మృతికి కారణమని శ్రావణి పేరేంట్స్ ఆరోపించారు.
విజయవాడ:ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆరు నెలల గర్భిణీ శ్రావణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుడుతుందనే ఉద్దేశ్యంతో అత్తింటివాళ్లు శ్రావణికి గడ్డిమందు ఇవ్వడంతో ఆమె చనిపోయిందని శ్రావణి పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ విషయమై శ్రావణి పేరేంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా బల్లికురువ మండలం కుప్పరపాలెం గ్రామానికి చెందిన శ్రావణికి రొంపిచర్ల మండలం సబ్బయ్యపాలెం గ్రామానికి గాడిపర్తి వేణుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు మొదటి సంతానం ఆడపిల్ల పుట్టింది. శ్రావణి మరోసారి గర్భం దాల్చింది.అయితే ఈనెల 2వ తేదీన శ్రావణికి స్కానింగ్ చేయించారు.స్కానింగ్ జరిగిన నాలుగు రోజుల తర్వాత శ్రావణి అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు అత్తింటివాళ్లు.
శ్రావణిపై విష ప్రయోగం జరిగిందని వైద్యులు గుర్తించారు. శ్రావణి పేగులు మాడిపోయినట్టుగా గుర్తించారు. తమ కూతురు అస్వస్థతకు గురికావడానికి అత్తింటివాళ్లే కారణమని శ్రావణి పేరేంట్స్ ఆరోపిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.శ్రావణికి రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టే అవకాశం ఉందని భావించి ఆమెపై విష ప్రయోగం చేశారని అనే అనుమానాన్ని శ్రావణి పేరేంట్స్ వ్యక్తం చేస్తున్నారని ఆ కథనం తెలిపింది. శ్రావణి భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగా శ్రావణిని అడ్డు తొలగించుకొనే ప్రయత్నం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆ కథనం తెలిపింది.శ్రావణి ఆరోగ్యం దెబ్బతినడానికి గల కారణాలు ఏమిటనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.