ఐఆర్‌కు ఇన్ని అర్థాలా.. రేపు పీఆర్సీని కూడా వడ్డీ లేని రుణం అంటారా: ప్రభుత్వంపై ఉద్యోగ నేతల విమర్శలు

Siva Kodati |  
Published : Feb 04, 2022, 03:25 PM IST
ఐఆర్‌కు ఇన్ని అర్థాలా.. రేపు పీఆర్సీని కూడా వడ్డీ లేని రుణం అంటారా: ప్రభుత్వంపై ఉద్యోగ నేతల విమర్శలు

సారాంశం

ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం ఎలా అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ ఇచ్చిన పీఆర్సీని కూడా రేపు రుణమని అంటారేమోనని, తమకు సందేహంగా వుందని వారు దుయ్యబట్టారు. పీఆర్సీ కమీషన్ రిపోర్ట్ బహిర్గతం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు

పీఆర్సీ కమీషన్ రిపోర్ట్ బహిర్గతం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కని చెప్పారు. ఇప్పటికే తాము 13వ వేతన సవరణలో వుండాలని.. కానీ ప్రస్తుతం 11వ వేతన సవరణ జరుగుతోందన్నారు. ఇప్పటికే ఉద్యోగులు రెండు సార్లు పీఆర్సీ కోల్పోయారని అన్నారు. ఐఆర్‌కు సీఎస్.. రకరకాల అర్థాలు చెబుతున్నారని ఉద్యోగ నేతలు విమర్శించారు. ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. ఇవాళ ఇచ్చిన పీఆర్సీని కూడా రేపు రుణమని అంటారేమోనని, తమకు సందేహంగా వుందని వారు దుయ్యబట్టారు. 

అటు ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో టీడీపీ, జనసేన సహా ఇతర రాజకీయ పార్టీల వ్యక్తులు ఎవరూ పాల్గొనలేదని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల మేలు కోసం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో పాటు ఎవరు మద్దతిచ్చినా మంచిదేనని వెంకట్రామిరెడ్డి అన్నారు.  ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలిరావడంతో ‘చలో విజయవాడ’ విజయవంతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.   

విజయవాడ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి ఉద్యమం చూడలేదని వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) అన్నారు. కొందరు వ్యక్తులు ఉద్యోగుల పట్ల ప్రజలల్లో వ్యతిరేక భావన తెచ్చే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. నిన్నటి ఆందోళనపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. రేపు సెలవు రోజు కావడంతో నేడే సచివాలయంలో పెన్‌డౌన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ సమీర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో చర్చిస్తామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

కాగా.  జగన్ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ (PRC)ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న(గురువారం) ఛలో విజయవాడ (Chalo Vijayawada)ను విజయవంతం చేసుకున్న ఉద్యోగులు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసారు. తమ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తూ సచివాలయ ఉద్యోగులు పెన్ డౌన్ (pen down) చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరష్కరించే వరకు విధులకు దూరంగా వుంటామని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేసారు. 

ఇప్పటికే పీఆర్సీ నిరసలను ఉదృతం చేస్తూ ఈ నెల 7వ తేదీ(సోమవారం) నుండి సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ ఉద్యోగులు ఓరోజు ముందుగానే తమ సమ్మెను ప్రారంభించారు. రేపు, ఎల్లుండి(శని,ఆదివారం) సెలవురోజుల కావడంతో ఇవాళ్టినుండి విధులకు దూరంగా వుండాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పెన్ డౌన్ ,యాప్ డౌన్ చేపట్టారు. 

ఇదిలావుంటే నిన్న(గురువారం) ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతం కావడంతో పీఆర్సీ సాధన సమితి కూడా స్పీడ్ పెంచింది. ఓవైపు ప్రభుత్వంతో చర్చలగురించి సమాలోచనలు చేస్తూనే మరోవైపు సమ్మెను సక్సెస్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఛలో విజయవాడ మాదిరిగానే ఉద్యోగులందరినీ ఒకేతాటిపైకి తెచ్చి సమ్మెలో పాల్గొనేలా చేయడంద్వారా ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్