
హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై (nandamuri balakrishna) ఏపీ మంత్రి శంకర్ నారయణ ( shankar narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య రాజీనామా చేయాలని ప్రజలే కోరుకుంటున్నారని అన్నారు. ఏడేళ్లు ఎమ్మెల్యేగా ఉండి హిందూపూర్ అభివృద్దికి బాలయ్య చేసిందేమి లేదని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుకు.. ఏ జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సినిమా షూటింగ్‌లు లేనప్పుడే బాలకృష్ణకు ప్రజలు గుర్తుకొస్తారని ఆరోపించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఉంచడమే కరెక్ట్ అని ఆయన అన్నారు.
ఇక, హిందూపూర్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో నందమూరి బాలకృష్ణ నేడు స్థానికంగా మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పట్టణంలోని శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హిందూపూర్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దమని ఎమ్మెల్యే Balakrishna సంచలన ప్రకటన చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్దమా అని బాలకృష్ణ ప్రశ్నించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కన్పించడం లేదన్నారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు.హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. అర్ధరాత్రి జీవోలు జారీ చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని బాలకృష్ణ విమర్శించారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం ప్రత్యక్షంగా పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. తెలుగుదనానికి NTR ఓ సంతకం అని బాలకృష్ణ చెప్పారు.
Kadapa జిల్లాకు YSR పేరు పెడితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన TDP ప్రభుత్వం ఆ పేరును కొనసాగించిందని బాలకృష్ణ గుర్తు చేశారు. YCP అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను ఎత్తివేసిందన్నారు.హిందూపురం జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్దమేనని ఆయన ప్రకటించారు. హిందూపురానికి మెడికల్ కాలేజీని ఇవ్వాలని తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరినట్టుగా చెప్పారు. కానీ మెడికల్ కాలేజీని పెనుగొండలో ఏర్పాటు చేశారన్నారు. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే దాన్ని పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.