ఉద్యోగ సంఘం వర్సెస్ ఐఏఎస్ ల సంఘం... మరో ములుపు తిరిగిన పీఆర్సీ వివాదం

By Arun Kumar PFirst Published Jan 20, 2022, 10:28 AM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి తమకు అన్యాయం జరిగేలా చూసారంటూ రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ పై ఉద్యోగ సంఘాల నాయకుల చేసిన కామెంట్స్ పై ఐఏఎస్ అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సి వివాదం (PRC Issue) ముదురుతోంది. పీఆర్సీ ప్రకటన సమయంలోనే ఉద్యోగుల ఆందోళన తప్పదని అందరూ భావించారు... కానీ సీఎం జగన్ (YS Jagan) భరోసాతో ఉద్యోగులు వెనక్కితగ్గారు. కానీ తాజాగా పీఆర్సీ జీవోల జారీతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబికింది. తమకు అన్యాయం చేసేలా వున్న జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళనలకు సిద్దమయ్యారు.

అయితే ఈ సమయంలోనే పీఆర్సీ జీవోల వివాదం మరో మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (sameer sharma)ను తప్పుబడుతూ ఉద్యోగ సంఘాల నేత చేసిన కామెంట్స్ కు ఐఎఎస్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై  ఐఎఎస్ ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ పై సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు.

''ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారని సూర్యనారాయణ అనే ప్రభుత్వ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలను ఏపీ ఐఏఎస్ ల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది'' అని ఏపీ ఐఎఎస్ అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. 

''పాలనా పరంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీఎస్ పరిపాలనా అధిపతి. అన్ని సంఘాలు, ఉద్యోగుల పట్ల సీఎస్ బాధ్యతగానే వ్యవహరిస్తారు. వృత్తిపరంగా ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే విషయాన్ని ఉద్యోగులు తెలుసుకోవాలి. సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీఎస్‌పై ఆరోపణలు చేయడం తగదు. బాధ్యతారాహిత్యంగా భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని ఆశిస్తున్నాము'' అంటూ ఐఎఎస్ అధికారుల సంఘం హెచ్చరించింది. 

ఇప్పటికే పీఆర్సీ ప్రకటన తాము అనుకున్నట్లు లేకున్నా సర్దుకుపోయామని... కానీ ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఇటీవల విడుదల చేసిన మూడూ జీవోలను అంగీరించేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చేసాయి. సీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు జీవోలను అమలు చేయకుండా మరోసారి ఉద్యోగులతో చర్చించి కొత్త జీవోలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోను గత మంగళవారం పీఆర్సీ విషయమై సీఎంవో అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. జీవోల్లోని పొందుపర్చిన అంశాలు తమకు నష్టం చేసేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సీఎంఓ అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ సీఎస్ సమీశ్ శర్మపై విమర్శలు గుప్పించారు. 

పీఆర్సీ విషయంలో ఏర్పాటుచేసిన ఐఏఎస్ అధికారుల సిఫారసులను సీఎం పక్కన పెట్టాలని సూర్యనారాయణ కోరారు. సీఎస్ సమీర్ శర్మ సీఎం జగన్ ను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చీఫ్ సెక్రెటరీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని సూర్యనారాయణ మండిపడ్డారు. 

ఉద్యోగులు ఏం కోరుకొంటున్నారు... పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల వైఖరిని ఇంటలిజెన్స్ ద్వారా తెప్పించుకోవాలని సీఎంకు సూచించారు. కొత్తగా జారీ చేసిన జీవోలతో ఉద్యోగులు 4 నుండి 12 శాతం వేతనాలను కోల్పోయే అవకాశం ఉందని సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు.

పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను అమలు చేయకుండా అవసరమైతే ఉద్యోగులకు రెండు నెలలు పాత జీతాలను కొనసాగిస్తూ తమతో చర్చలు జరపాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవోల విషయమై సీఎం  జగన్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

 
 

click me!