అనాధ శవాన్ని 2కిలోమీటర్లు భుజాలపై మోసి... మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు (వీడియో)

By Arun Kumar PFirst Published Apr 30, 2021, 12:32 PM IST
Highlights

దట్టమైన అడవి ప్రాంతం నుండి అనాధ శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకువచ్చి విధుల్లో మానవత్వం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
 

ప్రకాశం: విధుల్లో భాగంగా కటువుగా వుండే పోలీసులు అవసరమైతే మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తున్నారు. ఇటీవలే ఓ అనాధ శవాన్ని భుజాలపై మోసి మహిళా ఎస్సై ప్రశంసలు పొందగా తాజాగా అలాంటి సంఘటనే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. దట్టమైన అడవి ప్రాంతం నుండి అనాధ శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకువచ్చి విధుల్లో మానవత్వం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఓ శవాన్నికుళ్లిపోయిన స్థితిలో స్థానికులు గుర్తించారు. అది సుమారు 50-60 మధ్య వయస్సు గల యాచకుడి  మృతదేహంగా గుర్తించారు. దీంతో మర్రిపాలెం గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే దోర్నాల పోలీసులకి తెలియజేశారు.

 వెంటనే స్పందించిన ఎస్సై సంఘటనా స్థలానికి జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ నాగరాజు, సురేష్ లను సదరు గ్రామానికి పంపారు. మర్రిపాలెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతానికి  చేరుకొన్న వారు మృతదేహాన్ని గ్రామానికి తరలించడానికి ప్రయత్నించారు. అందుకు గ్రామస్తులెవ్వరూ ముందుకు రాకపోవడంతో మానవత్వంతో వ్యవహరించారు. సదరు శవాన్ని హెడ్ కానిస్టేబుల్స్ ఓ స్ధానికుడు సహాయంతో ఒక కర్రకు కట్టుకొని  స్వయంగా తమ భుజాల మీద  2కిలోమోటర్లు మోసుకొని గ్రామానికి తీసుకొని వచ్చారు.  

 మృతదేహాన్ని  గ్రామానికి చేర్చి అక్కడి  నుండి వాహనంలో ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. దోర్నాల పోలీస్ స్టేషన్లో పనిచేసే సదరు హెడ్ కానిస్టేబుల్స్ చేసిన మానవత్వంతో కూడిన విధులను పోలీస్ అధికారులు మరియు ప్రజలు అభినందించారు.


 

click me!