
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోందనటానికి తాజాగా వెలుగు చూసిన శేఖర్ రెడ్డి ఉదంతమే నిదర్శనం. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన దేవాదాయ వ్యవహారాల్లో ప్రభుత్వం, ప్రత్యేకించి అధికార పార్టీ జోక్యం మితిమీరిపోవటం చాలా కాలంగా జరుగుతున్నదే.
చెన్నైకి చెందిన వ్యాపార వేత్త శేఖర్ రెడ్డి అటు జయలలిత, ఇటు చంద్రబాబునాయడు ఇద్దరికీ సన్నిహితుడే. పై ఇద్దరితో ఆయనకున్న సాన్నిహిత్యమే టిటిడి బోర్యు సభ్యత్వం రావటానికి ఏకైక అర్హతగా మారింది. గడచిన ముప్పై ఏళ్ళుగా టిటిడి బోర్డులో సభ్యత్వం రావటమంటే కొందరికి పెద్ద ప్రతిష్టగా మారింది.
ఒకపుడు టిటిడి బోర్డులో సభ్యత్వం ఇచ్చేటపుడు వివిధ రంగాల్లోని ప్రముఖులను ఎంపిక చేసేవారు. వారివల్ల టిటిడి ప్రతిష్ట మరింత పెరిగేది. రానురాను రాజకీయ జోక్యం పెరిగిపోవటంతో మంత్రి పదవులు, ఎంఎల్ఏ టిక్కెట్లను ఇవ్వలేని వారికి టిటిడిలో బోర్డు సభ్యత్వం ఇవ్వటమన్నది ఆనవాయితీగా మారింది.
దాని ఫలితంగానే బోర్డును ఎంఎల్ఏలు, రాజకీయ నేతలతో భర్తీ చేస్తున్నారు. పోనీ నేతలను నియమించే సమయంలోనైనా వారి గత చరిత్రను చూస్తున్నారా అంటే అదీ లేదు. అవసరాలను మాత్రం చూసుకుని నియామకాలు చేస్తుండటంతో పలుకుబడి ఉన్న వారే బోర్డులో సభ్యత్వం పొందగలగుతున్నారు. దాంతోనే వివాదాలు మొదలవుతున్నాయి.
ప్రస్తుతం పట్టుబడ్డ శేఖర్ రెడ్డి వద్ద రూ. 174 కోట్ల మేర కొత్త నోట్లు, 120 కిలోల బంగారం దొరకటం పెద్ద సంచలనమే. పట్టుబడ్డ శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడు కూడా కావటంతో వార్తల్లో టిటిడి పేరు కూడా వస్తోంది. దాంతో టిటిడి ప్రతిష్టకు బురద అంటుకుంటోంది.
టిటిడి బోర్డు సభ్యులుగా ఉంటూ వివాదాల్లో ఇరుక్కోవటం ఇదే మొదలు కాదు. గతంలో కూడా పలువురు సభ్యులు శ్రీవారి ఆర్జితం సేవల టిక్కెట్లు అమ్మకాల కుంభకోణంలో ఇరుక్కున్నారు. కాటేజీలు, ప్రసాదాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులూ ఉన్నారు.
ఛైర్మన్లుగా, సభ్యులుగా నియమితులైన వారు తమ పదవులను అడ్డం పెట్టుకుని సొంత వ్యపారాలను పెంచుకున్న వారు కూడా ఉన్నారు. కాకపోతే సభ్యత్వాన్ని కోల్పోవటం మాత్రం శేఖర్ రెడ్డితోనే మొదలు.