యువతే లక్ష్యంగా యువనేతలు

First Published Nov 17, 2016, 4:37 AM IST
Highlights

ముగ్గురు యువనేతలూ యువతనే లక్ష్యం చేసుకుని ముందుకు సాగుతున్న విషయం స్పష్టమవుతోంది.

అజెండాలు వేరైనా లక్ష్యం మాత్రం యువతే. వచ్చే ఎన్నికల్లో యువత మద్దతే ధ్యేయంగా రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది, జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ యాత్రలను రూపొందించుకుంటున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు రిహార్సిల్స్ అన్నట్లు త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుయాని అనుకుంటున్న ప్రతిపక్షాలు ముందుజాగ్రత్తగా సన్నద్ధమవుతున్నాయి.

 

 రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు యువత మద్దతు కోసం నువ్వా నేనా అన్నట్లు పోటి  పడుతుండగా మధ్యలో జనసేన కూడా తయారైంది. దాంతో వచ్చే ఎన్నికల్లో మూడు ముక్కలాట తప్పదా అన్నట్లు రాజకీయ వాతావరణం తయారైంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై యువతలో చైతన్యం తేవటానికి వైసీపీ సమావేశాలు నిర్వహిస్తున్నది. అంతేకాకుండా నేరుగా వారితోనే ముఖాముఖి కూడా జరుపుతున్నది.

 

 

 

  ప్రత్యేకహోదా సాధనలో విఫలం, ప్రత్యేక రైల్వేజోన్ సాధించలేకపోవటం, ఓటుకునోటు కేసు నుండి బయటపడేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెడుతున్నట్లు ముఖ్యమంత్రిపై జగన్ ధ్వజమెత్తుతున్నారు. ఇక రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు, టిడిపి నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. మరిన్ని యువభేరి కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంతో చంద్రబాబుపై ఒత్తిడి తేవటానికి ప్రయత్నిస్తున్నారు.

 

  టిడిపి తరపున లోకేష్ కూడా యువత మద్దతు పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని కళాశాలలకు చెందిన విద్యార్ధులే లక్ష్యంగా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. గడచిన రెండున్నరేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి కోసం చంద్రబాబు వేస్తున్న ప్రణాళికలు తదితరాలతో పాటు ప్రతిపక్ష నేతపైన కూడా వ్యంగ్యాశ్త్రాలు సంధిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ముఖాముఖి కార్యక్రమాల రూపకల్పనలో లోకేష్ బిజిగా ఉన్నట్లు సమాచారం.

 

 

  ఇక, ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తిరుపతి, కాకినాడ, అనంతపురంలో ఇప్పటికే మూడు సభలు నిర్వహించారు. ఈ మూడు సభల్లోనూ కేవలం యువతను ఆకట్టుకోవటమే లక్ష్యంగా పవన్ ప్రసంగాలు సాగటం గమనార్హం. అందుకే గుత్తిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులతో ముఖాముఖి కూడా నిర్వహించారు. జనసేన పార్టీని ఏర్పాటు చేసి చాలా కాలమే అయినా నాటకీయంగా మొన్నటి అనంతపురం సభలో తాను అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, అధికార టిడిపి విషయంలో తన వైఖరిని పవన్ ఇంతవరకూ స్పష్టంగా ప్రకటించకపోవటం గమనార్హం. ఏదేమైనా ముగ్గురు యువనేతలూ యువతనే లక్ష్యం చేసుకుని ముందుకు సాగుతున్న విషయం స్పష్టమవుతోంది.

click me!