
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ వనవాసం అయిపోయిందని చెబుతున్నారు. జనసేనను పట్టకుని ఆయన ఒక పార్టీ వాడు అవుతున్నాడనే పుకార్లతో హైదరబాద్ హోరెత్తి పోతున్నది. దీనికి కారణం, ఈ రోజు కిరణ్, పవన్ కల్యాణ్ ఇంటికివెళ్లి చాలా సేపు మాట్లాడటం. అక్కడ ఒక అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇదే జరిగితే, కిరణ్ కు ఒక పార్టీదొరికినట్లువుతుంది. రాజకీయ లెక్కాచారం అంతగా ఒంట పట్టని పవన్ కొక మాస్టారు దొరికినట్లవుతుంది. అయితే, ఇది జరగుతుందో లేదో తెలియదు. ఎవరూ నిర్ధారించడంలేదు. వదంతుల ప్రకారం నవంబర్ 25 న ఆయన జనసైనికుడయిపోతాడట. 2010 లో అదే రోజున ఆయన ముఖ్యమంత్రి గా ప్రమాణం చేశాడు. ఈ ల్యాండ్ మార్క్ ముహూర్తాన్ని మరొకసారి సెలెబ్రేట్ చేసుకునేందుకు వీలుగా ఆయన ఈ తేదీని ఎంచుకున్నారని తెలిసింది.
కాంగ్రెస్ లెక్కల ప్రకారం కిరణ్ చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయసులో ఆయన పదవిని కోల్పోయారు. తర్వాత రాజకీయాలనుంచి దూరమయ్యారు. సాధారణంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పదవి పోగానే ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తారు. కాని, అలాంటి అవకాశం కిరణ్ కురాలేదు. రాష్ట్ర విభజనతో ఢిల్లీలో కాంగ్రెస్ పోయింది. నాయకత్వం మీద అలిగి కిరణ్ కూడా కాంగ్రెస్ కు దూరమయ్యాడు.(ఉండీ చేసేదేముందునుకుంటూ వుండవచ్చు) ఈ మధ్య కాషాయ దళంలో చేరేందుకు ప్రయత్నించారు. కుల రాజకీయాల వల్ల ఆయనకు వీసా దొరకలేదని తెలిసింది. ఫలితంగా ఆయన ఎటూ వెళ్ల లేక , ఇంట్లో ఉండలేక కాలం వెల్లబుచ్చుతున్నారు.
రెండు వారాల కిందట చిత్తూరు జిల్లాలో ఒక మారు మూల పల్లెలో కొంతమంది మిత్రులతో మాట్లాడుతూ ’పెళ్లినిశ్చయమయింది, ముహూర్తం దొరకాలి’ అని నర్మగర్భంగా చెప్పి వూహగానాలకు తెరలేపారు.
తర్వాత ఇపుడు పవన్ తో సమావేశం అయ్యారు. రెండున్నరేళ్లలో ఒక్క రాజకీయ మాట మాటాడని అరుదయిన నాయకుడు కిరణ్. వారిద్దరి మధ్య ఇదొక సామ్యం కావచ్చు.
సైన్యం లేని పార్టీ నడుపుతున్న జనసేనాపతికి కిరణ్ కొండంత అండగా కనిపించవచ్చు. అలాగే చిన్న వయసులో రాజకీయాలకుదూరమై సతమతమవుతున్న కిరణ్ కు పవన్ మండువేసవిలో చలివేంద్రం లాగా కనిపించవచ్చు.
కిరణ్ చేరాక మరికొంతమంది చేర్పించి జనసేనను మరొక తెలుగుదేశం, కాంగ్రెస్, బిజిపి స్థాయికి తీసుకురావడంలో కిరణ్ సహకరించవచ్చు. ఎన్నికల లో తలపడగల ధనము జనమూ ఉన్నవాళ్లు చాలా మంది ఒక కొత్త పార్టీ కోసం చూస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ నుంచి వెళ్లి పోయిన మరొక ఎంపి లగడ పాటి కూడా కిరణ్ దారిలో వెళతారని కూడా వినబడుతూ ఉంది.
అన్నట్లు ఈ మధ్యలో ఆయన జన సమైక్యాంధ్ర పార్టీని కూడా ఏర్పాటుచేశారు. అదేమయిందో తెలియదు. నవంబర్ 25 న ఈ విషయం వెల్లడిస్తాడేమో చూద్దాం.