రంజాన్ అయిపోయింది రాజా.. జనాల్లోకి రావా..?

First Published Jun 18, 2018, 12:40 PM IST
Highlights

రంజాన్ అయిపోయింది రాజా.. జనాల్లోకి రావా..?

రాజకీయ చదరంగంలో గెలవడం అంత సులువేం కాదు... పకడ్భందీ ప్రణాళికతో పాటు.. వ్యూహా, ప్రతివ్యూహాలు... ప్రత్యర్థులు ఊహించలేనంత వేగవంతమైన నిర్ణయాలు ఉండాలి.. ఇక అన్నింటికి మించి ఓర్పు, సహనం, పట్టుదల ఒక నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు. కానీ ఇవేవి ఇప్పుడు పవన్ కళ్యాణ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదనే వాదనలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి..

రెండేళ్ల నుంచి జనంలోకి వస్తా... కడిగిపారేస్తానంటూ ఊరించి ఊరించి వచ్చిన పవన్ కళ్యాణ్‌ ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టి.. శ్రీకాకుళం, విజయనగరంలలో తిరిగాడు.. విశాఖలో ఎంట్రీ ఇచ్చి.. జిల్లా మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్న టైంలో ఆయనకు రంజాన్ గుర్తొచ్చింది.. అంతే తన ప్రజా పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు.. ఈ చర్యతో రాజకీయాలపై పవన్ చిత్తశుద్ధిపై మరోసారి చర్చ నడుస్తోంది..

అసలు షెడ్యూల్ ఖరారు చేసే సమయంలో ఏ రోజు ఏ పండుగలు వస్తాయో పవన్‌కి తెలియదా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని చూస్తే.. అక్రమాస్తుల కేసుల్లో విచారణ నిమిత్తం ఆయన ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి.. దీనిపై జగన్ పార్టీ శ్రేణులకు, జనానికి క్లారిటీ ఇచ్చేశారు.. న్యాయస్థానం ముందు హాజరై.. ఈ తర్వాతి రోజు యధావిధిగా తన యాత్రను కొనసాగిస్తున్నారు..

ఇక చంద్రబాబు నాయుడును చూస్తే.. ఒక పనిని గట్టిగా పట్టుకున్నారంటే దాని అంతు చూసే వరకు నిద్రపోరని ఆయనకు పేరు.. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం నవనిర్మాణ దీక్షలు, మహాసభలు, ర్యాలీలు పేరిట జనం చూపును తనవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు.. కానీ పవన్‌లో అంతటి పట్టుదల కనిపించడం లేదు.

రాజకీయం అన్నది పులి మీద స్వారీ లాంటిది.. ఒకసారి ఎక్కిన తర్వాత.. స్వారీ చేయాలి తప్పించి.. మధ్యలో దిగి ఒళ్లు విరుచుకుంటానంటే కుదరదు. కొద్దిరోజుల క్రితం పవన్ స్పీడ్ చూసి.. టీడీపీ, వైసీపీలకు మూడో ప్రత్యామ్నాయంగా జనసేన కచ్చితంగా నిలబడుతుందని అనుకున్నారంతా.. జనసైనికుల్లోనూ ఆ స్ధాయి జోష్ కనిపించింది. ఆ బూస్టప్‌ను సరిగ్గా వాడుకోవాల్సింది పోయి.. ఆ వేడిని రంజాన్ సెలవుల పేరుతో సప్పున చల్లార్చేశాడు పవన్. ఇకనైనా పండగలు, పబ్బాలు మానుకోని.. గెలుపు పొందే వరకు అలుపు లేకుండా శ్రమిస్తే మంచిదని విశ్లేషకులు అంటున్నారు.

click me!